హైదరాబాద్‌: తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉద్ధృత రూపం దాల్చుతోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్‌తో కార్మికులు ఆందోళన చేపడుతున్నారు. కాగా సమ్మె 10 రోజులకు చేరుకుంది. డిమాండ్ల సాధన కోసం కార్మికుల డిపోల వద్ద బైఠాయించారు. ఆర్టీసీని కాపాడాలని.. ఎవరూ కూడా భావోద్వేగాలకు గురై ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఆర్టీసీ యూనియన్‌ నాయకులు పిలుపునిచ్చారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో బంద్‌ కొనసాగుతోంది. ఈ రెండు జిల్లాలోని ప్రజలు సమ్మెకు మద్ధతు తెలుపుతున్నారు. సమస్యల పరిష్కారం జరిగే వరకు పోరాటం ఆగదని కార్మిక నేతలు చెబుతున్నారు. మరో వైపు ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు ఉద్యోగ సంఘాలు, రాజకీయ పార్టీలు ఆర్టీసీ సమ్మెకు పూర్తి మద్ధతు ప్రకటించాయి.

ఇదిలా ఉంటే ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతను చూపిస్తున్నారు. సమ్మె 10 రోజులకు చేరుకున్న ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమ్మెకు మద్థతు తెలిపిన విద్యార్థి నాయకులు హైదరాబాద్‌లోని బస్‌భవన్‌ ముట్టడికి ప్రయత్నించారు. దీంతో వారిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అన్ని జిల్లాల్లోని ఆర్టీసీ కార్మికులు వారి కుటుంబాలతో కలిసి డిపోల ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.