• సమ్మె వాయిదా వేసిన బ్యాంక్ ఉద్యోగులు
  • 26, 27 తేదీల్లో యథావిధిగా బ్యాంక్ కార్యకలాపాలు
  • సమస్యలపై  కమిటీకి కేంద్ర ఆర్ధిక కార్యదర్శి ఓకే

ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం వ్యతిరేకిస్తూ ఆందోళన బాట పడతామన్న ఉద్యోగులు వెనక్కి తగ్గారు. రెండు రోజుల పాటు సమ్మె చేస్తామన్న బ్యాంక్ ఉద్యోగులతో కేంద్ర ఆర్థిక శాఖాధికారులు భేటీ అయ్యారు. ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ఉద్యోగ సంఘాలు కోరాయి. దీనికి కేంద్ర ఆర్ధిక శాఖ కార్యదర్శి రాజీవ్ కుమార్ సానుకూలంగా స్పందించారు. దీంతో..ఈ నెల 26 , 27 తేదీల్లో ప్రభుత్వరంగ బ్యాంకులు సమ్మెకు దిగాలని తీసుకున్న నిర్ణయం వాయిదా పడింది.

26 ,27 తేదీల్లో యధావిధిగా బ్యాంకుల కార్యకలాపాలు

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కేంద్రం హామీ ఇవ్వడంతో సమ్మెను విరమించుకున్నట్లు ఉద్యోగులు తెలిపారు. 26, 27 తేదీల్లో బ్యాంకులు యధావిథిగా పని చేస్తాయన్నారు. ఇటీవల కేంద్రం బ్యాంకుల విలీనాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే..ఈ ప్రకటనను ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయి యూనియన్‌ ఆమోదించలేదు.

ఇప్పటికే పని ఒత్తిడితో ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని యూనియన్ తెలిపింది. బ్యాంకుల విలీనంతో మరింత భారం పడుతుందన్నారు. కొందరు ఉద్యోగులు జాబ్‌లు పోతాయని కూడా బాధ పడుతున్నారని యూనియన్ ప్రతినిధులు చెప్పారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.