వలసదారులపై 'అమెరికా నిబంధనాస్త్రాం'.. దక్షిణాసియా అమెరికన్లకు ఎదురుదెబ్బ

By అంజి  Published on  24 Feb 2020 4:14 AM GMT
వలసదారులపై అమెరికా నిబంధనాస్త్రాం.. దక్షిణాసియా అమెరికన్లకు ఎదురుదెబ్బ

అమెరికాలో వసలదారులపై మరోసారి కఠిన నిబంధనలు అమలు చేసేందుకు ట్రంప్‌ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. అమెరికాలో శాశ్వత నివాసం ఏర్పరుచుకోవాలనే విదేశీయులకు అక్కడి ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఆధారపడకుండా నిషేధం విధించేందకు సమాయత్తమైంది. అమెరికాలోని పన్ను చెల్లింపు దారులపై వలసదారులు అదనపు భారంగా మారకుండా ఈ నిషేధాన్ని తీసుకొచ్చింది. ఈ నిబంధన ఇవాళ్టి నుంచి ఆ దేశంలో అమల్లోకి రానుంది.

అయితే హెచ్‌-1బీ వీసాలపై అమెరికాలో ఉంటూ గ్రీన్‌ కార్డు కోసం చూస్తున్నవారిపై ఇది చాలా ప్రతికూలతను చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెరికాలో పేదల కోసం అక్కడి ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది. సంక్షేమ కార్యక్రమాల్లో తక్కువ ధరకు ఆహార స్టాంపులు అందజేయడం, ఉచిత విద్య, ఆరోగ్య పథకాలు వంటివి ఉన్నాయి. అయితే వీటిని పేద అమెరికన్ల కంటే.. వలసదారులే ఎక్కువగా వినియోగించుకుంటున్నారని అమెరికాలో వాదనలు వినిపిస్తున్నాయి. దీని వల్ల స్వదేశీ పన్ను చెల్లింపుదారులపై అధిక భారం పడుతోందని తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

నిర్దేశిత సంక్షేమ పథకాలను వాడుకుంటే ఎలాంటి నష్టం ఉండదు. ఎక్కవగా సంక్షేమ పథకాలను ఉపయోగించుకోవాలనుకునే వలసదారులను అమెరికాలో పబ్లిక్‌ ఛార్జ్‌గా పిలుస్తారు. వారి సంఖ్యను తగ్గించేందుకు గత సంవత్సరం ఆగస్టు 14న ట్రంప్‌ ప్రభుత్వం కొత్త నిబంధనను తీసుకు వచ్చింది. ఇక్కడ ఉండాలనుకునే వలసదారులు వారి కాళ్లపై వారే నిలబడాలని కొత్త నిబంధనలో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకవేళ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఉపయోగించుకుంటే వీసా గడువు పొడిగించమని, గ్రీన్‌కార్డు కూడా ఇవ్వమని ట్రంప్‌ ప్రభుత్వం తేల్చి చెప్పింది. అమెరికాలోనే శాశ్వతంగా ఉండాలనుకునే విదేశీయులు.. తాము నిర్దేశిత సంక్షేమ పథకాలను మాత్రమే ఉపయోగించుకున్నామని ఆధారాలు సమర్పించాలని చెప్పింది. గత సంవత్సరం తీసుకువచ్చిన ఈ నిబంధన కొంత కాలంగా కోర్టు తీర్పుల కారణంగా అమల్లోకి రాలేదు. కాగా శుక్రవారం రోజున సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో నిబంధనకు అన్ని అడ్డంకులు తొలగిపోయాయి.

ఈ నిబంధన ఎక్కువగా దక్షిణాసియా అమెరికన్లపై ప్రభావం చూపనుంది. ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌ తెలిపిన నివేదిక ప్రకారం.. అమెరికాలో ఉన్న 50 లక్షల మంది దక్షిణాసియన్లలో.. 4.72 లక్షల మంది పేదరికంలో మగ్గుతున్నారు. భూటానీలు 33.3శాతం, బంగ్లాదేశీలు 24.2 శాతం, నేపాలీలు 23.9 శాతం, పాకిస్తానీలు 15.8 శాతం అమెరికాలో పేదరికంతో ఇబ్బందులు పడుతున్నారు. కాగా 11 శాతం నాన్‌ సిటిజన్‌ భారతీయ కుటుంబాలు అక్కడి సంక్షేమ పథకాల నుంచి లబ్ది పొందుతున్నట్లు 2018 వలస విధాన కేంద్రం నివేదిక చెబుతోంది.

Next Story