పశువులకు వింత వ్యాధి.. కోడిగుడ్డు సైజులో బుడగలు..
By Newsmeter.Network Published on 11 May 2020 10:09 AM ISTప్రస్తుతం కరోనా వైరస్ ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. ఈ వైరస్ వ్యాప్తిచెందకుండా మాస్క్‌లు ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తున్నారు. తాజాగా చిత్తూరు జిల్లాలో పశువులకూ ఓ వింత వ్యాధి సోకుతుంది. ఒక పశువు నుంచి మరో పశువుకు ఈ వ్యాధి వేగంగా వ్యాపిస్తోంది. దీనిని పరీక్షించిన పశువైద్యులు పశువు పశువుకు మధ్య దూరం పాటించాలని సూచిస్తున్నారు. పలమనేరు ప్రాంతంలోని పలు గ్రామాల్లో పశువులకు ఈ వ్యాధి ఉధృతి ఎక్కువగా కనిపిస్తుంది. దీంతో పశుపోషకులు భయాందోళన చెందుతున్నారు. వ్యాధి సోకిన పాడి ఆవుల చర్మంపై పెద్ద బుడ్డలా పెరిగి ఆపై పగిలిపోతున్నాయి. నెల రోజుల క్రితం మండలంలోని కరిడిమొడుగులో ఈ వ్యాధి బయటపడింది. ఆపై సముద్రపల్లి, మొరం పంచాయతీల్లో వ్యాపించి ఇప్పుడు బేరుపల్లిలో విజృంభిస్తోందని స్థానిక పశుపోషకులు చెబుతున్నారు.
Also Read : కీలక నిర్ణయం: ఏపీలో లాక్‌డౌన్ సడలింపులు
వ్యాధి సోకిన గంటల్లోనే తీవ్రరూపం దాల్చుతుంది. ఆరోగ్యవంతమైన పశువులకు ఈ వ్యాధి సోకిన గంటల్లోనే చర్మంపై చిన్నపాటి కోడిగుడ్డు సైజులో బుడగలా ఉబ్బుతుంది. ఆపై అది పగిలిపోయి పుండలా మారుతోంది. వ్యాధి సోకిన పశువులను పరీక్షించిన పశువైద్యులు.. ముద్దచర్మవ్యాధి లాంటిందని చెబుతున్నారు. ఈ రకమైన వ్యాధిని ఇప్పుడే తొలిసారిగా చూస్తున్నామని అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు వేలకు వేలు పెట్టి కొన్న పాడిపశువులకు ఈ వ్యాధి వేగంగా వ్యాపిస్తుండటంతో పాడిరైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ వ్యాధి గత ఏడాది చివర్లో దేశంలోని ఒడిశాలో తొలత పశువులకు సోకిందని తెలుస్తోంది. ఇప్పుడు చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో పశువైద్యులు ఆందళన చెందుతున్నారు. ప్రస్తుతం వ్యాధిని అదుపుచేసేందుకు ఫెన్సిలిన్ ఇంజెక్షన్, ఐయోడెక్స్ అయింట్‌మెంట్‌ని ఇస్తున్నారు. ఈ వ్యాధితో పశువులకు ప్రాణాపాయం లేదని, అయిన తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పశువైద్యులు చెబుతున్నారు.
Also Read : బ్రేకింగ్: ఏపీ: పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం