సీతమ్మ వాకిట్లో స్టాక్‌ మార్కెట్ల పంట..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  20 Sep 2019 10:55 AM GMT
సీతమ్మ వాకిట్లో స్టాక్‌ మార్కెట్ల పంట..!

  • లాభాలతో ఎగిసిపడ్డ స్టాక్ మార్కెట్లు
  • మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1924 పాయింట్ల లాభం
  • నిఫ్టీ కూడా 569 పాయింట్లు లాభం
  • దేశీయ కంపెనీల కార్పొరేట్ పన్ను తగ్గింపు మంత్రం
  • డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.71.05

ముంబై: సీతమ్మ మాట లాభాల పంట పండించింది. నీరసంగా ఉన్న స్టాక్‌ మార్కెట్లకు సీతమ్మ మాట సంజీవినిల పని చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒక్క ప్రకటనతో మందగమనంలో ఉన్న ఆర్దిక వ్యవస్థకు జీవం పోశారు. దీంతో 10ఏళ్లలో ఎక్కడాలేనంతగా స్టాక్‌ మార్కెట్లు లాభాల పంట పండించాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మళ్లీ 11వేల మార్క్‌ దాటగా.. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేజీ సెన్సెక్స్ ఏకంగా 1900 పాయింట్లు లాభపడింది.

ఉదయం నీరసంగా ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు..సీతమ్మ ప్రకటనతో ఒక్కసారిగా ఊపందుకున్నాయి. దేశీయ కంపెనీల కార్పొరేట్ పన్ను తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చింది. దీంతో మార్కెట్లు లాభాలు దిశగా పరుగులు పెట్టాయి. ఒక సమయంలో సెన్సెక్స్‌ ఏకంగా 2000 పాయింట్లు దాటింది. నిఫ్టీ కూడా 600 పాయింట్ల లాభంతో ట్రేడ్ అయింది.

మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1924 పాయింట్ల లాభంతో 38,015 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ కూడా 569 పాయింట్లు లాభపడి 11,274 వద్ద ముగిసింది. ఇవాళ ఒక్కరోజు మదుపరుల సంపద 6లక్షల కోట్లు పెరిగింది. గత 10 ఏళ్లలో సూచీలు ఇంత లాభపడిన సందర్భం లేదు. ఇక రూపాయి కూడా పుంజుకుంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.71.05గా ఉంది.

Next Story