స్టాలిన్ పిలుపునకు రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల స్పందనేమిటి?
By సుభాష్ Published on 29 Aug 2020 2:34 AM GMTఇప్పటివరకు ఎప్పుడు ఎదురుకాని అనుభవం ఒకటి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు తాజాగా ఎదురైందని చెప్పాలి. కేంద్రంలోని మోడీ సర్కారుతో కలివిడిగా వ్యవహరిస్తూనే.. అవసరానికి తగ్గట్లు వ్యాఖ్యలు చేయటం అలవాటైన వారికి ఇప్పుడు కొత్త తిప్పలు ఎదురైనట్లుగా చెప్పాలి. మోడీతో తమకున్న ప్రత్యేక స్నేహానికి పరీక్ష పెట్టేలా తమ ఉమ్మడి మిత్రుడి మాట మారిందంటున్నారు. దేశ వ్యాప్తంగా ఇంజనీరింగ్.. మెడికల్ కాలేజీల సీట్ల భర్తీ కోసం నిర్వహించే నీట్.. జేఈఈ పరీక్షల్ని ఈ ఏడాది నిర్వహించకుండా వాయిదా వేయాలన్నది కాంగ్రెస్ సహా పలు విపక్షాల మాట. అందుకు భిన్నంగా పరీక్ష నిర్వహిస్తామంటూ కేంద్రం చేస్తున్న హడావుడి తెలిసిందే.
ఈ నేపథ్యంలో కేంద్రంపై పోరాడేందుకు విపక్షాలు ఇప్పుడు రంగంలోకి దిగాయి. తాజాగా తమిళనాడు విపక్ష నేత స్టాలిన్ ఈ అంశంపై రంగంలోకి దిగారు. మోడీ సర్కారు తీరుకు వ్యతిరేకంగా.. ఈ పరీక్షల్ని వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. తన డిమాండ్ తన వరకు కాకుండా.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కూడా తమతో పాటు కలిసి రావాలని కోరుతున్నారు.
నీట్ - జేఈఈ పరీక్షల వాయిదా కోసం తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నామని.. తమతో పాటు.. రెండు తెలుగు రాష్ట్రాల్ని వెంట రావాలన్న మాటతో పాటు.. మరో ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని సైతం స్టాలిన్ కోరారు. మిగిలిన వారి సంగతి పక్కన పెడితే.. ముఖ్యమంత్రులు కేసీఆర్.. జగన్ లు ఎలా రియాక్టు అవుతారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఎందుకంటే.. స్టాలిన్ తో స్నేహ బంధం ఆయన వెంట వెళ్లాల్సిన పరిస్థితి. ఒకవేళ.. అలా చేస్తే.. ప్రధాని మోడీతో నేరుగా లడాయి పెట్టుకున్నట్లు అవుతుంది.
ఇప్పటికే ఈ పరీక్షల విషయంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఓపెన్ గా రియాక్టు కాకున్నా.. కేంద్ర నిర్ణయానికి అనుగుణంగానే వ్యవహరిస్తున్నారు. ఈ అంశంపై మోడీ సర్కారుకు వ్యతిరేకింగా మాట్లాడింది లేదు. ఇలాంటి వేళ.. స్టాలిన్ మాట ఇరువురికి పరీక్షగా మారినట్లు చెప్పాలి. తమిళనాడు విపక్ష నేత కోరిన రీతిలో స్పందించని పక్షంలో.. మిత్రుడి మాటను కాదన్నట్లు తేలుతుంది. అలా అని.. స్టాలిన్ మాటకు తాము అండగా ఉంటామని ప్రకటిస్తే.. మోడీతో పెట్టుకున్నట్లు అవుతుంది. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రా ల ముఖ్యమంత్రుల మాటేమిటి? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.