కాలేజీలో విద్యార్థుల గ్యాంగ్ వార్.. కత్తులతో హల్‌చల్
By అంజి Published on 5 Feb 2020 12:58 PM IST
చెన్నై: విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన తమిళనాడుకు చెందిన ఓ వర్సిటీ వివాదాలకు కెరాఫ్ అడ్రస్‌గా మారింది. చెంగల్‌పేట సమీపంలోని పొద్దరిలో ఎస్‌ఆర్‌ఎమ్ వర్సిటీలో మరోసారి తుపాకీ సంస్కృతి వెలుగులోకి వచ్చింది. విద్యార్థుల గ్యాంగ్ వార్ స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
విద్యార్థులే వీధి రౌడీల్లా ప్రవర్తిస్తూ పరస్పరం కత్తులతో, తుపాకులతో దాడులు చేసుకున్నారు. వర్సిటీ క్యాంటిన్ వద్ద ఎంబీఏ విద్యార్థులు ఒకరిపై ఒకరు ఘర్షణకు దిగారు. విచక్షణ రహితంగా దాడులు చేసుకోవడంతో ఐదుగురు విద్యార్థులకు తీవ్రగాయాలు అయ్యాయి.
ఓ విద్యార్థి తుపాకీ అక్కడ హల్‌చల్ చేయగా.. విద్యార్థులు భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. ఘర్షణ సమయంలో విద్యార్థులు తుపాకీతో కాల్పులు జరుపుతుండగా సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర కలకలం రేపింది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎస్‌ఆర్‌ఎం వర్సిటీలో గొడవ జరిగిన ప్రదేశాన్ని పోలీసులు పరిశీలించారు. ఘర్షణ దిగిన ఇరువర్గాలను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. గాయాలపాలైన ఐదుగురిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.