శ్రీనివాస్ రెడ్డే దోషి..తీర్పుపై ఉత్కంఠ

By రాణి  Published on  6 Feb 2020 11:22 AM GMT
శ్రీనివాస్ రెడ్డే దోషి..తీర్పుపై ఉత్కంఠ

హజీపూర్ హత్యల కేసులో నిందితుడు శ్రీనివాస్ రెడ్డిపై నేరం రుజువైంది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హాజీపూర్ హత్యల కేసులో నిందితుడు మర్రి శ్రీనివాస్ రెడ్డిని కోర్టు దోషిగా నిర్థారించింది. శ్రీనివాస్ రెడ్డిపై నేరం రుజువైనట్లు ఫోక్సో జడ్జి తెలిపారు. మూడు నేరాల్లో శ్రీనివాస్ రెడ్డే నిందితుడని ప్రాసిక్యూషన్ నిరూపించిందని జడ్జి శ్రీనివాస్ రెడ్డికి తెలిపారు. నిందితుడు శ్రీనివాస్ కు ఉరిశిక్షే సరైనదంటూ ప్రాసిక్యూషన్ వాదించింది. మర్రి శ్రీనివాసరెడ్డి అన్ని విధాలుగా ఉరిశిక్షకు అర్హుడని.. జాలి, దయ చూపాల్సిన అవసరం లేదని ప్రాసిక్యూషన్ పదేపదే విజ్ఞప్తి చేసింది. ఈ కేసులను అరుదైన కేసుల్లో అరుదైనవిగా పరిగణించాలని.. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు అందుకు అనుగుణంగా ఉన్నాయని ప్రాసిక్యూటర్ వాదించారు.

ముందుగా పోలీసులు శ్రీనివాస్ రెడ్డిని కోర్టులో హాజరు పరుచగా..శ్రీనివాస్ తనకు ఈ నేరాలతో ఏం సంబంధం లేదని, కావాలనే తనను ఈ కేసుల్లో ఇరికించారని, తాను నేరం చేయలేదంటూ జడ్జి ఎదుట రోదించాడు. ముగ్గురు అమ్మాయిలను చంపాడన్న నింద వేసి తన ఇంటిని కూల్చి వేశారని వాపోయాడు. తన తల్లిదండ్రులను చూసుకునేందుకు ఎవరూ లేరని, వాళ్లను తానే చూసుకోవాలని కోర్టుకు విన్నవించుకున్నాడు. కోర్టు ఇచ్చే తీర్పుపై ఏమైనా చెప్పాలనుకుంటున్నావా అని జడ్జి శ్రీనివాస్ ను ప్రశ్నించగా..తనకు ఈ నేరానికి సంబంధం లేదని వాదించాడు. కాగా..తల్లిదండ్రులు ఎక్కడున్నారని జడ్జి ప్రశ్నించగా.. వారు ఎక్కడున్నారో తనకు తెలియదని సమాధానమిచ్చాడు. శ్రీనివాస్ రెడ్డికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ భారీ ఎత్తున హాజీపూర్ గ్రామస్తులు కోర్టుకు చేరుకున్నారు. నేడు తీర్పు ఇవ్వనున్న నేపథ్యంలో సీపీ మహేష్ భగవత్ కూడా కోర్టు ప్రాంగణానికి వచ్చారు.

మరోవైపు హాజీపూర్ వరుస హత్యల కేసులో నిందితుడైన శ్రీనివాస్ రెడ్డికి ఉరిశిక్ష విధించాలంటూ హాజీపూర్ గ్రామ సచివాలయం వద్ద గ్రామస్తులు, బాధిత కుటుంబ సభ్యులు ప్లకార్డులు పట్టుకుని ఆందోళన నిర్వహించారు. వీరికి స్థానిక ప్రజా సంఘాలు, న్యాయవాదులు, ఇతరులు మద్దతిచ్చారు.

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలోని హాజిపూర్ గ్రామానికి చెందిన మర్రి శ్రీనివాస్ రెడ్డి లిఫ్ట్ పేరుతో ముగ్గురు మైనర్ బాలికలను బైక్‌పై ఎక్కించుకొని తన వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లి అత్యాచారం, హత్య చేసి బావిలో పూడ్చి పెట్టాడు. యువతుల అదృశ్యాలపై వరుసగా కేసులు నమోదవుతుండటంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆ గ్రామంలో తనిఖీలు చేయడం ప్రారంభించారు.

శ్రావణి అదృశ్యంతో..

2019, ఏప్రిల్ 25వ తేదీన హాజీపూర్ గ్రామానికి చెందిన విద్యార్థిని శ్రావణి అదృశ్యమవ్వడంతో అదే రోజున తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు శ్రావణి కోసం గాలించినప్పటికీ..గ్రామంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో ఆమె ఆచూకీ దొరకలేదు. మరుసటి రోజు శ్రావణి చదువుతున్న స్కూల్ వెళ్లి ప్రశ్నించగా..ఆమె బొమ్మలరామారం వెళ్లినట్లుగా తెలుసుకున్నారు. ఏప్రిల్ 26న కీసర - బొమ్మల రామారం మార్గంలో సీసీ ఫుటేజీల ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఏప్రిల్ 26న హాజీపూర్ లోని పాడుబడ్డ బావి పక్కన శ్రావణి స్కూల్ బ్యాగ్ లభించగా..27వ తేదీన శ్రావణి మృతదేహం లభ్యమైంది. ఆ మృతదేహం తమ కూతురిదేనని గుర్తించారు కుటుంబ సభ్యులు. ఆ బావి మర్రి శ్రీనివాసరెడ్డికి సంబంధించినదిగా గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు.

పోలీసుల విచారణలో శ్రావణి పై అత్యాచారం చేసి, తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు శ్రీనివాస్. అలాగే 2015లో మైసిరెడ్డిపల్లికి చెందిన కల్పనను, మనీషా ను కూడా తానే అత్యాచారం చేసి హత్య చేసినట్లు అంగీకరించాడు. ఈ నేరాలన్నింటికి సంబంధించిన ఆధారాలను ప్రాసిక్యూషన్ నల్గొండ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో అందజేసింది. బాధితురాళ్లపై జరిగిన ఘటనల తాలూకు ఫొటోలు, వీడియోలను పరిశీలించిన జడ్జి నిందితుడు మర్రి శ్రీనివాస్ రెడ్డిని హాజీపూర్ హత్యల కేసులో ప్రధాన ముద్దాయిగా నిర్థారించారు. జడ్జి ఇచ్చే తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వరుస హత్యల కేసు విచారణను పోలీసులు 90 రోజుల్లో ముగించారు. మొత్తం 101 మంది ప్రత్యక్ష సాక్షులను విచారించారు.

Next Story
Share it