ఐపిఎల్ అభిమానులకు శుభవార్త.. లంకలో 13వ సీజన్..!
By తోట వంశీ కుమార్ Published on 17 April 2020 7:23 AM GMTకరోనా వైరస్(కొవిడ్-19) ముప్పుతో క్రీడా రంగం కుదేలైంది. ఈ మహమ్మారి వల్ల పలు క్రీడా టోర్నీలు వాయిదా పడగా.. మరికొన్ని టోర్నీలు రద్దు అయ్యాయి. ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) మార్చి 29 నుంచి ప్రారంభం కావాల్సిన ఉండగా.. ఈ మహమ్మారి ముప్పుతో ఏప్రిల్ 15 కు వాయిదా వేశారు. కాగా.. దేశంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగించారు. దీంతో ఐపిఎల్ ను నిరవధికంగా వాయిదా వేస్తున్నామని బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే.
కరోనా ప్రభావం పూర్తిగా తగ్గిపోయాకనే ఐపీఎల్ నిర్వహించడం గురించి ఆలోచిస్తామని బీసీసీఐ సెక్రటరీ జయ్ షా తెలిపాడు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే.. ఇప్పట్లో ఐపీఎల్ టోర్నీ జరిగేలా కనపడడం లేదు. కాగా ఈ ఏడాది ఐపీఎల్-13వ సీజన్ రద్దు అయితే..దాదాపు రూ.3 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లనుంది. దీంతో బీసీసీఐ అందుబాటులో ఉన్న అవకాశాలను పరిశీలిస్తోంది.
తాజాగా.. శ్రీలంక క్రికెట్ బోర్డు ఓ ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. బీసీసీఐకి అభ్యంతరం లేకపోతే.. ఐపిఎల్-13 వ సీజన్‌ను శ్రీలంకలో నిర్వహిస్తామని ఆదేశ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు షమ్మి సిల్వ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం దీని గురించి బీసీసీఐతో ప్రాథమిక చర్చలు నడుస్తున్నట్లు చెప్పాడు. కాగా.. అన్ని దేశాల్లో కరోనా విజృంభిస్తున్న శ్రీలంకలో దీని ప్రభావం అంతంత మాత్రంగానే ఉంది. మన దేశంలో ఇప్పటి వరకు 13వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. శ్రీలంకలో 238 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఒక వేళ దీనికి బీసీసీఐ అంగీకరిస్తే.. త్వరలోనే ఐపీఎల్-13వ సీజన్ కు మార్గం సుగమమైనట్లే.