పెళ్లి సందడి లేని శ్రావణ మాసం
By సుభాష్ Published on 24 July 2020 5:52 AM GMTశ్రావణం వచ్చిందంటే చాలు తనతో పాటు కొత్త సందడిని తెచ్చేస్తుంది. ఓవైపు శ్రావణమాస పూజలు.. వ్రతాల హడావుడి ఓపక్క.. మరోవైపు పెళ్లిళ్లతో సహా పలు శుభకార్యాల కోసం హడావుడి హడావుడిగా ఉంటుంది. ప్రతి ఇంట్లోనూ ఏదోలాంటి పండుగ లాంటి వాతావరణం నెలకొంటుంది. ఇదేమీ లేకున్నా నాలుగు శుక్రవారాలు ప్రతి ఇంట్లోనూ కళకళలాడేలా చేస్తుంది. మాయదారి కరోనా పుణ్యమా అని ఈసారి శ్రావణమాసం చిన్నబోయేలా చేస్తుంది.
పెళ్లి అన్నంతనే ఇటీవల మారిన ట్రెండ్ కు తగ్గట్లు.. మెహందీ.. సంగీత్ తో పాటు భారీ ఎత్తున పెళ్లిళ్ల కోసం చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. ఎక్కడెక్కడి మిత్రులు సైతం పెళ్లిళ్ల కోసంప్రత్యేకంగా వచ్చేస్తుంటారు. ఈ ట్రెండ్ ఇప్పుడు పూర్తిగా మారింది. కోవిడ్ నిబంధనలు ఓవైపు.. వైరస్ ఎక్కడ వచ్చి మీద పడుతుందోనన్న ఆందోళనతో పెళ్లిళ్ల మీద ఇంట్రస్టు చూపించని వారే ఎక్కువగా ఉంటున్నారట.
హైదరాబాద్ మహానగరంలో ఈ శ్రావణమాసంలో తక్కువలో తక్కువ యాభై వేల పెళ్లిళ్లు జరగాల్సి ఉన్నట్లు చెబుతున్నారు. ఇందులో ఇరవై నుంచి ముప్ఫై శాతం పెళ్లిళ్లు జరుగుతాయా? అన్నది కూడా సందేహమేనని చెబుతున్నారు. జీవితంలో ఒక్కసారి చేసుకున్న పెళ్లిలో అయినవారందరి నడుమ చేసుకోకపోతే ఏం బాగుంటుందన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.
కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో నామమాత్రంగా పెళ్లి చేసుకోవటానికి చాలామంది ఆసక్తి చూపటం లేదట. ఇంతకాలం ఎటూ వెయిట్ చేశాం.. మరో నాలుగు నెలలు ఓపిక పడితే.. పరిస్థితుల్లో మార్పులు వస్తాయన్న ఆశతో ఉన్నట్లు చెబుతున్నారు. నాణెనికి ఇదో వైపు అయితే.. మారిన పరిస్థితులకు తగ్గట్లు సింఫుల్ గా పెళ్లిళ్లు చేసుకోవటానికి కొందరు ఇంట్రస్టు చూపిస్తున్నారట. ఖర్చు తగ్గిపోవటం.. మమ్మల్ని పిలవలేదు.. మర్యాదు చేయలేదన్న గోల ఉండదని.. అయినోళ్లు మధ్య పూర్తి చేస్తే బాగుంటుందని కొందరు భావిస్తున్నారట. ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వారు ఫటాఫట్ అన్నట్లుగా పెళ్లి కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నట్లు చెబుతున్నారు.
మొత్తంగా చూస్తే.. కరోనావేళ పెళ్లిళ్లలో మార్పు రావటమే కాదు.. ఈ సందర్భంగా జరిగే పెద్ద ఎత్తున వ్యాపారాలకు భారీ దెబ్బ పడినట్లుగా వాపోతున్నారు. పెళ్లితో ఎన్నో వ్యాపారాలు ముడి పడి ఉన్నాయి. అవన్నీ మారిన ఆలోచనలకు తగ్గట్లు ప్రభావానికి గురి అవుతున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నారు. పరిస్థితులు చక్కబడితే.. 2021లో పెళ్లిళ్ల జోరు ఏ రేంజ్లో జరుగుతాయని అంచనా వేస్తున్నారు.