చహల్‌ చెత్త రికార్డు.. తన రికార్డును తానే బ్రేక్ చేసుకుని మ‌రీ

Yuzvendra Chahal Gets Worst Record .. ఏ బౌల‌ర్ కూడా కోరుకుని రికార్డును భార‌త స్పిన్న‌ర్ య‌జ్వేంద్ర చహ‌ల్ రెండు సార్లు

By సుభాష్  Published on  28 Nov 2020 6:06 AM GMT
చహల్‌ చెత్త రికార్డు.. తన రికార్డును తానే బ్రేక్ చేసుకుని మ‌రీ

ఏ బౌల‌ర్ కూడా కోరుకుని రికార్డును భార‌త స్పిన్న‌ర్ య‌జ్వేంద్ర చహ‌ల్ రెండు సార్లు అందుకున్నాడు. త‌న రికార్డును తానే బ్రేక్ చేసుకున్నాడు. క‌రోనా మ‌హ‌మ్మారి త‌రువాత ఆడిన తొలి అంత‌ర్జాతీయ మ్యాచ్‌లో చ‌హ‌ల్ ఈ రికార్డును అందుకున్నాడు. ఆసీస్‌తో మూడు వ‌న్డేల సిరీస్‌లో భాగంగా శుక్ర‌వారం సిడ్ని వేదిక‌గా జ‌రిగిన తొలి వ‌న్డేల్లో భార‌త్ ఘోర ఓట‌మిని చ‌విచూసింది.

ఈ మ్యాచ్‌లో భార‌త బౌల‌ర్లు పోటీలు ప‌డి మ‌రీ ప‌రుగులు ఇచ్చారు. ఇక భార‌త స్పిన్న‌ర్ చ‌హ‌ల్ అయితే.. 10 ఓవ‌ర్ల‌లో వికెట్ మాత్ర‌మే సాధించి 89 ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నాడు. ఇందులో ఐదు సిక్స‌ర్లు, ఐదు ఫోర్లు ఉన్నాయి. దీంతో వ‌న్డేల్లో అత్య‌ధిక ప‌రుగుల్ని స‌మ‌ర్పించుకున్న భార‌త స్పిన్న‌ర్‌గా చెత్త రికార్డును మూట‌గ‌ట్టుకున్నాడు. ఈ క్రమంలోనే తన రికార్డు తానే అధిగమించాడు చహల్‌. 2019 వన్డే ప్ర‌పంచ‌క‌ప్ సంద‌ర్భంగా ఇంగ్లాండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో చ‌హ‌ల్ 88 ప‌రుగులు ఇచ్చాడు.

తాజా సిడ్నీ వన్డేలో వాటికి ఒక్క పరుగు ఎక్కువగా ఇచ్చుకున్న చాహల్ తన పేరిట ఉన్న చెత్త రికార్డును తిరగరాసుకున్నాడు. వన్డేల్లో అత్యధిక పరుగులు ఇచ్చుకున్న భారత స్పిన్నర్ల జాబితాలో పియూష్ చావ్లా మూడో స్థానంలో ఉన్నాడు. 2008లో మిర్పూర్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో చావ్లా 85 రన్స్ ఇచ్చుకున్నాడు.

ఇక ఈ మ్యాచ్‌లో కోహ్లీసేన 66 పరుగులతో ఘోర ఓట‌మిని చ‌విచూసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 374 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. కెప్టెన్ ఆరోన్‌ ఫించ్ (114 124 బంతుల్లో 9 ఫోర్లు, 2సిక్స్‌లు), స్టీవ్ స్మిత్ (105 66 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీలతో చెలరేగగా.. డేవిడ్‌ వార్నర్‌ (69 76 బంతుల్లో 6ఫోర్లు ), గ్లెన్‌ మాక్స్‌వెల్ (45 19 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించ‌డంతో ఆసీస్ భారీ స్కోర్ సాధించింది. భారత్ బౌలర్లలో మహ్మద్ షమీ మూడు వికెట్లు తీయగా.. బుమ్రా, సైనీ, చాహల్ తలో వికెట్ తీశారు.

అనంతరం భారీ లక్ష్య చేధనకు దిగిన టీమ్ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 308 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 66 ప‌రుగుల తేడాతో ఓటమిపాలైంది. హార్దిక్ పాండ్యా(90 76 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లు), శిఖర్ ధావన్(74 86 బంతుల్లో 10 ఫోర్లు) రాణించినా.. మిగతా బ్యాట్స్‌మెన్లు విఫ‌ల‌మ‌వ్వ‌డంతో.. సుదీర్ఘ ప‌ర్య‌ట‌న‌ను భార‌త్ ఓట‌మితో ఆరంభించింది. ఆసీస్ బౌలర్లలో జంపా నాలుగు, హజల్ వుడ్ మూడు వికెట్లు తీయగా.. స్టార్క్ ఓ వికెట్ తీశాడు. ఆదివారం ఇరు జ‌ట్ల మ‌ధ్య రెండో వ‌న్డే జ‌ర‌గ‌నుంది.

Next Story