13 ఏళ్ల ఇండియన్‌ యంగ్‌ బైక్‌ రేసర్‌ దుర్మరణం

బైక్‌ క్రాష్‌లో ప్రముఖ భారతీయ రేసర్‌ శ్రేయాస్‌ హరీశ్‌ ప్రాణాలు కోల్పోయాడు.

By Srikanth Gundamalla  Published on  6 Aug 2023 5:31 PM IST
Young Bike Racer, Shreyas, Dead,  Chennai Track,

  13 ఏళ్ల ఇండియా యంగ్‌ బైక్‌ రేసర్‌ దుర్మరణం

చెన్నైలో జరిగిన జాతీయ మోటార్‌ సైకిల్‌ రేసింగ్‌ చాంపియన్‌షిప్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌ క్రాష్‌లో ప్రముఖ భారతీయ రేసర్‌ శ్రేయాస్‌ హరీశ్‌ ప్రాణాలు కోల్పోయాడు. శనివారం ఇరుంగట్టుకోట్టైలో బైక్‌ రేసింగ్ చాంపియన్‌షిప్‌ జరిగింది. ఈ పోటీల్లో 200 సీసీ బైక్‌ నడుపతుండగా మూడో రౌండ్‌ రేసులో బైక్‌ స్కిడ్‌ కావడంతో కిందపడిపోయారు శ్రేయాస్‌. హెల్మెట్‌ తల నుంచి ఊడిపోయింది. దాంతో.. తలకు తీవ్ర గాయం అయ్యింది. వెంటనే స్పందించిన రేసింగ్ నిర్వాహకులు శ్రేయాస్‌ను ఆస్పత్రికి తరలించారు. కానీ.. అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు ప్రకటించారు. శ్రేయాస్ మరణంతో మిగిలిన రేస్‌లను మద్రాస్‌ మోటార్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌ రద్దు చేసింది.

'ది బెంగళూరు కిడ్'గా ప్రసిద్ధి చెందిన శ్రేయాస్ బైక్ రేసింగ్లో ప్రపంచ ఛాంపియన్ షిప్ ఫైనల్ చేరిన తొలి భారతీయుడు.13 ఏళ్ల వయసులో ఇటీవల స్పెయిన్లో జరిగిన బైక్ రేసింగ్ ప్రపంచ ఛాంపియన్ షిప్ ఫైనల్కు చేరాడు. జూలై 26న జన్మించిన శ్రేయాస్‌ ఇటీవల తన 13వ పుట్టినరోజు వేడుకలు కూడా బాగా చేసుకున్నాడు. మంచి యంగ్‌ బైక్‌ రేసర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. చిన్న వయసులోనే అతడు సాధించిన విజయాలతో అందరూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఏడాది స్పెయిన్‌లో జరిగిన FIM మినీ-GP ప్రపంచ చాంపియన్‌ షిప్‌లో పాల్గొన్నాడు. మొదటి, రెండో రేసుల్లో 5వ, 4వ స్థానాల్లో నిలిచి తన ప్రతిభను చాటుకున్నారు శ్రేయాస్.

శ్రేయాస్‌ మృతితో క్రీడా రంగంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కొంతకాలంగా వరుస విజయాలతో చాంపియన్‌గా ఎదుగుతున్న శ్రేయస్ ప్రాణాలు కోల్పోవడం రేసింగ్ ప్రపంచాన్ని విషాదంలో ముంచింది. రేసింగ్ ప్రమాదకరమైనదే అయినా కూడా ఇలాంటి ఘటనలు అరుదుగా జరుగుతాయి. గత ఏడాది కేసీ కుమార్ అనే రేసర్ కూడా ప్రమాదానికి గురయ్యాడు. అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ ఏడాది జనవరిలో ప్రాణాలు కోల్పోయాడు.

Next Story