భారత్ వేదికగా జరుగుతోన్న వన్డే వరల్డ్ కప్-2023 టోర్నీలో టీమిండియా స్టార్ బ్యాటర్ చరిత్రను లిఖించుకున్నాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతోన్న మ్యాచ్‌లో విరాట్ సెంచరీ కొట్టేశాడు. ఎట్టకేలకు అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో ఇప్పటి వరకు క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ పేరుమీదున్న రికార్డును ఎట్టకేలకు సమం చేశాడు. ఈ సెంచరీతో విరాట్ కోహ్లీ తన 49వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అయితే.. ఈ వరల్డ్ కప్‌లో గత న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లోనే ఈ రికార్డు సమం చేయాల్సింది కానీ.. అప్పుడు కోహ్లీ 95 పరుగుల వద్ద ఉండగా ఔట్ అయ్యాడు.
అయితే.. మరోవైపు ఇవాళ విరాట్ బర్త్‌డే కావడం.. ఇదే రోజున సచిన్ రికార్డును సమం చేయడం ప్రత్యేకమనే చెప్పాలి. విరాట్ సెంచరీ చేరుకున్న సమయంలో స్టేడియంలో కోలాహలం నెలకొంది. అభిమానులంతా అరుపులతో.. సెల్‌ఫోన్లలో టార్చ్‌లైట్లు వేస్తూ విరాట్ కోహ్లీకి కంగ్రాట్స్ చెప్పారు. కాగా.. విరాట్ కోహ్లీ 119 బంతుల్లో 10 ఫోర్లతో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా ఇది విరాట్‌కు 78వ అంతర్జాతీయ సెంచరీ. 49 సెంచరీలు చేయడానికి సచిన్ టెండూల్కర్‌కు 452 ఇన్నింగ్స్ అవసరం కాగా.. 277 ఇన్నింగ్స్‌లలోనే కోహ్లీ ఈ ఘనతను అందుకున్నాడు.