షమీ సొంతూరులో మినీ స్టేడియం నిర్మాణం.. ప్రభుత్వం కసరత్తు
భారత్ వేదికగా జరుగుతోన్న వన్డే వరల్డ్ కప్ టోర్నీ-2023 చివరి దశకు చేరుకుంది.
By Srikanth Gundamalla Published on 18 Nov 2023 1:44 AM GMTషమీ సొంతూరులో మినీ స్టేడియం నిర్మాణం.. ప్రభుత్వం కసరత్తు
భారత్ వేదికగా జరుగుతోన్న వన్డే వరల్డ్ కప్ టోర్నీ-2023 చివరి దశకు చేరుకుంది. ఇప్పటి వరకు ఒక్క ఓటమిని చూడకుండా భారత జట్టు ఫైనల్‌కు చేరింది. ఇక మరో టీమ్ ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్‌లో ఇండియాతో తలపడనుంది. అయితే.. ఈ టోర్నీ గురించి చెప్పాలంటే ముఖ్యంగా భారత స్టార్ పేసర్ షమీ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆడిన ఆరు మ్యాచుల్లోనే బీభత్సకరమైన ప్రదర్శనతో ప్రత్యర్థి బ్యాటర్లకు చెమటలు పట్టించాడు. వరుసగా వికెట్లు తీస్తూ పెవిలియన్‌కు పంపించాడు. టీమిండియా గెలుపులో తన ప్రధాన పాత్ర పోషించాడు.
వరల్డ్ కప్‌లో అద్భుత ప్రదర్శన కనబరుస్తోన్న మహ్మద్ షమీ సొంతూరు ఉత్తర్ ప్రదేశ్‌లోని అలీనగర్. ఈ క్రమంలోనే అక్కడ ఉన్న యోగి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. షమీ సొంతూరులో క్రికెట్ మైదానాన్ని నిర్మించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ త్యాగి.. అలీనగర్ గ్రామాన్ని సందర్శించారు. ఆ తర్వాత ప్రభుత్వానికి నివేదిక అందించారు. వరల్డ్ కప్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చినందుకు ఈ గిఫ్ట్ ఇవ్వాలని యోగి సర్కార్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. మినీ స్టేడియం నిర్మాణానికి అనువైన స్థలాన్నికూడా అధికారులు గుర్తించారు. అమ్రోహా జిల్లా కలెక్టర్ రాజేష్ త్యాగి (IAS), అధికారుల బృందంతో శుక్రవారం అలీనగర్ గ్రామంలో పర్యటించారు.
గ్రామంలో మినీ స్టేడియం నిర్మణానికి ఒక ప్రతిపాదనను పంపుతున్నామని, గ్రామంలో తగినంత భూమి ఉందని గుర్తించామని కలెక్టర్ త్యాగి తెలిపారు. స్టేడియంతోపాటు జిమ్ కూడా ఉండాలని భావిస్తున్నట్టు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 20 స్టేడియాను నిర్మించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, ఈ జాబితాలో అమ్రోహా జిల్లా స్టేడియం కూడా ఉందని వివరించారు. ఈ జిల్లా నుంచి స్టేడియంను నిర్మించేందుకు మహ్మద్ షమీ స్వగ్రామం అలీనగర్‌ను ఎంపిక చేశాం అని కలెక్టర్ రాజేష్ త్యాగి అన్నారు.
వరల్డ్ కప్‌లో తొలి నాలుగు మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితమైన షమీ.. ఆ తర్వాత ఆడిన ఆరు మ్యాచుల్లో ఇరగదీశాడు. ఆడింది తక్కువ మ్యాచులే అయినా ఎక్కువ వికెట్లు తీసుకున్న బౌలర్‌గా నిలిచాడు. ఈ టోర్నీ అత్యధిక వికెట్లు (23 వికెట్లు) తీసుకున్న బౌలర్‌గా నిలిచాడు. పడి లేచిన కెరటంలా విజృంభిస్తున్న షమీ ప్రదర్శనపై క్రికెట్ ఫ్యాన్స్ నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. ఫైనల్‌లోనూ ఇదే దూకుడు కొనసాగించి, భారత్‌కు మూడో వరల్డ్ కప్ అందించడంలో అతడు కీలక పాత్ర పోషించాలని అభిమానులు కోరుకుంటున్నారు.