మరోసారి అశ్విన్ మాయ..తొలిటెస్టులో వెస్టిండీస్‌పై భారత్ ఘనవిజయం

వెస్టిండీస్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భాగంగా టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది.

By Srikanth Gundamalla  Published on  15 July 2023 7:23 AM IST
WI Vs IND, First Test, Match, India Won,

మరోసారి అశ్విన్ మాయ..తొలిటెస్టులో వెస్టిండీస్‌పై భారత్ ఘనవిజయం

వెస్టిండీస్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భాగంగా టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది. ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంటుంది.

డొమినికా వేదికగా ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టెస్టు మ్యాచ్లో భారత్ అద్భుత ప్రదర్శన చేసింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2023-25కు మంచి ఆరంభం దక్కింది. వెస్టిండీస్ పర్యటనలో ఉన్న భారత జట్టు ఆల్ రౌండర్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. టీమిండియా ఆటగాళ్లు అద్భుతంగా ఆడటంతో మూడు రోజుల్లోనే మ్యాచ్ ముగిసింది. 312/2 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆటను మెుదలెపెట్టిన భారత్.. 425/5 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.

ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్‌లో 271 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన కరీబియన్‌ జట్టు.. అశ్విన్ (7/71) స్పిన్‌ మాయాజాలంతో 130 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్‌ ఇన్నింగ్స్‌, 141 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో విండీస్‌ 150 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. అరంగేట్రంలోనే శతకంతో రాణించాడు యశస్వి జైస్వాల్. తొలి టెస్టులో ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇక భారత్‌, వెస్టిండీస్‌ మధ్య రెండో టెస్టు జూలై 20న మొదలు కానుంది.

వెస్టిండిస్‌తో జరిగిన తొలి టెస్టులో అశ్విన్ తన స్పిన్‌ మాయాజాలాన్ని చూపించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లోనూ దెబ్బకొట్టాడు. దాంతో కరేబియన్ ఆటగాళ్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టాల్సి వచ్చింది. త్యాగ్‌నారాయణ్‌ చందర్‌పాల్ (7)ను జడేజా ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపడంతో కరేబియన్‌ పతనం మొదలు అయ్యింది. కాసేపటికే క్రెయిన్ బ్రావెట్‌ (7) అశ్విన్ బౌలింగ్‌లో స్లిప్‌లో రహానెకు చిక్కాడు. ఇక టీ విరామం సమయానికి 27/2తో నిలిచింది వెస్టిండీస్. ఆ తర్వాత చివరి సెషన్‌లో మొత్తం 8 వికెట్లను కోల్పోయింది. చివరి సెషన్‌ ప్రారంభం అవ్వగానే బ్లావుడ్‌ను (5)ను అశ్విన్‌ వికెట్ల ముందు పట్టుకున్నాడు. కాసేపటికే రీఫర్‌ (11)ను జడేజా పెవిలియన్‌కు పంపాడు. సిరాజ్‌ బౌలింగ్‌లో ద సిల్వా (13) ఎల్బడబ్ల్యూగా పెవిలియన్‌కు వెళ్లాడు.

ఇక రెండో ఇన్నింగ్స్‌లో చివరి ఐదు వికెట్లు అశ్విన్‌ ఖాతాలోనే పడ్డాయి. నిలకడగా ఆడుతూ విండీస్‌ను ఆదుకునే ప్రయత్నం చేశారు అథనేజ్. అతన్ని 28 పరుగుల వద్ద స్లిప్‌లో యశస్వి జైస్వాల్‌కు చిక్కేలా బౌలింగ్ వేశాడు అశ్విన్. అల్జారీ జోసెఫ్ (13) శుభ్‌మన్ గిల్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. రఖీమ్ కార్న్‌వాల్‌ (4), కీమర్ రోచ్‌ (0) ఒకే ఓవర్‌లో ఔట్‌ అయ్యారు. ఈ క్రమంలో మూడోరోజు నిర్ణీత ఓవర్లు ముగిశాయి. ఆలౌట్‌కు విండీస్‌ ఒక వికెట్‌ దూరంలోనే ఉండటంతో మ్యాచ్‌ను అరగంట సేపు పొడిగించారు. ఆకర్లో మూడు ఫోర్లు బాదిన వారికన్ (18) ఎల్బీడబ్ల్యూగా ఔట్‌ అయ్యాడు. దాంతో వెస్టిండీస్‌ ఆలౌట్ అయ్యింది. చివరి ఐదు వికెట్లు అశ్విన్‌కే దక్కాయి. రెండో ఇన్నింగ్స్‌లో మొత్తం 7 వికెట్లు తీశాడు అశ్విన్.

తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ప్లేయర్ యశస్వి జైస్వాల్ సత్తా చాటాడు. 387 బంతుల్లో 16 ఫోర్లు, ఒక సిక్సర్‌తో మొత్తం 171 పరుగులు సాధించాడు. రోహిత్‌ శర్మ కూడా రాణించాడు. 221 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 10. పరుగులు కొట్టాడు. విరాట్‌ కోహ్లీ హాఫ్‌ సెంచరీని అకౌంట్లో వేసుకున్నాడు. మొత్తంగా వెస్టిండీస్‌ను టీమిండియా చిత్తుగా ఓడించింది. ఇన్నింగ్స్, 141 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

Next Story