విరాట్‌ను కౌగిలించుకుని ఎమోషనల్ అయిన విండీస్ క్రికెటర్ తల్లి

వెస్టిండీస్‌ క్రికెటర్ తల్లి విరాట్‌ పట్ల తన అభిమానాన్ని చాటుకుంది.

By Srikanth Gundamalla
Published on : 22 July 2023 2:01 PM IST

WI Cricketer Mother,  Tears,  Meeting Virat Kohli,

విరాట్‌ను కౌగిలించుకుని ఎమోషనల్ అయిన విండీస్ క్రికెటర్ తల్లి

టీమిండియా స్టార్‌ బ్యాటర్ విరాట్‌ కోహ్లీకి ఉన్న ఫ్యాన్‌ బేస్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన బ్యాటింగ్‌ చేస్తుంటే అభిమానులు స్టేడియంలో చప్పట్లు.. ఈలలు, అరుపులతో సందడి చేస్తారు. ఒక్క ఇండియాలోనే కాదు.. విరాట్‌కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉంటారు. అంతెందుకు ప్రత్యర్థి టీముల్లోనూ ప్లేయర్లు చాలా మంది విరాట్‌ ఆటను ఇష్టపడతారు. ప్రస్తుతం వెస్టిండీస్‌తో టెస్ట్‌ మ్యాచ్‌ ఆడుతోంది భారత్. ఈ క్రమంలో అక్కడ ఒక వెస్టిండీస్‌ క్రికెటర్ తల్లి విరాట్‌ పట్ల తన అభిమానాన్ని చాటుకుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

వెస్టిండీస్‌ క్రికెటర్‌ జాషువా డా సిల్వా తల్లి తన అభిమానాన్ని చాటుకుంది. వెస్టిండీస్‌తో రెండో టెస్ట్‌ మ్యాచ్‌ రెండో రోజు తర్వాత కోహ్లీని కలిసింది సిల్వా తల్లి. అతన్ని హగ్‌ చేసుకుని ఎంతో ఆనంద పడింది. కోహ్లీ కూడా తనకు కొడుకులాంటి వాడే అని చెప్పింది. కోహ్లీని కలవాలనేది తన కల.. అది ఇప్పుడు సాకారమైందని చెప్పుకొచ్చింది. జాషువా సిల్వా కూడా విరాట్‌ నుంచి చాలా నేర్చుకుంటాడని తను భావిస్తున్నట్లు తెలిపింది. విరాట్‌కు హగ్‌ ఇచ్చి ముద్దు కూడా పెట్టింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఒక సెల్ఫీ తీసుకున్నారు. విరాట్‌ కోహ్లీని కలిసిన ఆనందంలో సిల్వా తల్లి ఆనంద బాష్పాలు కార్చింది. కాగా.. కోహ్లీ బ్యాటింగ్ చూడటానికే తన తల్లి స్టేడియానికి వచ్చిందిన విరాట్‌తో సిల్వా చెప్పాడు. కానీ అప్పుడు విరాట్‌ అది నమ్మలేదు. చివరకు సిల్వా తల్లి నేరుగా కలిసి అభిమానాన్ని చూపించడంతో విరాట్‌ కూడా ఆనందపడిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. విరాట్‌ కోహ్లీకి ఇండియాలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉంటారని.. ప్రత్యర్థులైనా సరే విరాట్‌ ఆటకు ఫిదా అవ్వాల్సిందే అంటున్నారు పలువురు నెటిజన్లు

Next Story