విషాదం.. ఒకేరోజు ఇద్దరు వెస్టిండీస్‌ లెజెండరీ క్రికెటర్లు మృతి

వెస్టిండీస్‌ క్రికెట్‌లో విషాదం చోటుచేసుకుంది. ఒకే రోజు ఇద్దరు లెజెండరీ క్రికెటర్లు ప్రాణాలు కోల్పోయారు.

By Srikanth Gundamalla  Published on  9 Dec 2023 12:49 PM IST
west indies, two legendary cricketers, died, same day,

విషాదం.. ఒకేరోజు ఇద్దరు వెస్టిండీస్‌ లెజెండరీ క్రికెటర్లు మృతి

వెస్టిండీస్‌ క్రికెట్‌లో విషాదం చోటుచేసుకుంది. ఒకే రోజు ఇద్దరు లెజెండరీ క్రికెటర్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర సంఘటనలు డిసెంబర్‌ 8న జరిగాయి. వెస్టిండీస్ మాజీ స్పిన్నర్‌ క్లైడ్ బట్స్‌ (66) రోడ్డు ప్రమాదంలో శుక్రవారం చనిపోయారు. అదేరోజు మరో దిగ్గజ ఆటగాడు జో సోలమన్ (93) అనారోగ్యంతో కన్నుమూశారు. ఇద్దరూ చనిపోయిన విషయాన్ని క్రికెట్‌ వెస్టిండీస్‌ ఎక్స్ (ట్విట్టర్‌) వేదికగా తెలిపింది.

గయానాకు చెందిన జో సోలమన్ వెస్టిండీస్‌ తరఫున క్రికెట్‌ ఆడారు. వెస్టిండీస్‌లో కొన్నాళ్లపాటు ఆయన ఫేమస్‌ బ్యాటర్‌గా ఉన్నాడు. 1958 నుంచి 1965 మధ్య వెస్టిండీస్‌ తరఫున 27 టెస్టులు ఆడిన సోలమన్.. 34 సగటు రేటుతో 1326 పరుగులు చేశారు. ముఖ్యంగా 1960లో గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో సోలమన్‌ అద్భుతమైన ఆటతీరుని ప్రదర్శించాడు. ఒక వైపు వికెట్లు పడుతున్నా.. ఆఖరి రోజు చివరి వరకు క్రీజులో ఉండి మ్యాచ్‌న డ్రాగా ముగించేశాడు సోలమన్. ఆ ప్రదర్శన ఆయన కెరీర్‌లోనే బెస్ట్‌ ఆటగాడిగా పేరు సంపాదించింది.

మరో దిగ్గజ ఆటగాడు క్లైడ్‌ బట్స్‌ 1980లో వెస్టిండీస్‌ తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. బట్స్‌ రాకముందు వరకు వెస్టిండీస్‌ టీమ్‌ అంటే ఫాస్ట్‌ బౌలర్లకు పేరు గాంచిన టీమ్‌గా ఉండేది. కానీ.. బట్స్‌ హాఫ్స్‌ స్పిన్‌ బౌలింగ్‌తో ప్రత్యర్థుల వికెట్లను వరుగా తీసేవాడు. అద్భుతమైన స్కిల్స్‌తో త్వరలోనే మంచి గుర్తింపును సాధించుకున్నాడు. తద్వారా జాతీయ జట్టు తరఫున కేవలం 7 మ్యాచ్‌లు మాత్రమే ఆడినా.. బట్స్‌కు దేశవాళీ క్రికెట్‌లో మాత్రం అద్భుతమైన రికార్డు ఉంది. క్లైడ్‌ బట్స్ 87 ఫస్ట్‌క్లాస్, 32 లిస్ట్‌-ఏ మ్యాచుల్లో గయానాకు ప్రాతినిథ్యం వహించాడు. క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన తర్వాత ఆయన కామెంటేటర్‌గా కూడా కొనసాగారు. 2000 సంవత్సరంలో క్రికెట్‌ సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌గా కూడా పనిచేశాడు.

ఒకేరోజు ఇద్దరు దిగ్గజ క్రికెటర్లు మృతిచెందడం పట్ల ఆ దేశంలోని క్రికెట్‌ అభిమానులు, వెస్టిండ్‌ క్రికెట్‌ సంతాపం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఒకరి తర్వాత ఒకరి ఫొటోలను ఎక్స్‌ (ట్విట్టర్‌) వేదికగా షేర్‌ చేసి ప్రగాఢ సానుభూతి ప్రకటించింది వెస్టిండీస్‌ క్రికెట్.

Next Story