ప్రతిష్టాత్మక అవార్డు రేస్‌లో మెస్సీ, కోహ్లీ.. గెలుపెవరిదో?

విరాట్ కోహ్లీ, మెస్సీ ఇద్దరూ తమతమ ఆటల్లో మేటిగా రాణించారు.

By Srikanth Gundamalla  Published on  31 Dec 2023 10:45 AM GMT
virat kohli,  messi, pubity athlete year award-2023,

ప్రతిష్టాత్మక అవార్డు రేస్‌లో మెస్సీ, కోహ్లీ.. గెలుపెవరిదో? 

టీమిండియా స్టార్‌ బ్యాటర్ విరాట్‌ కోహ్లీ రన్‌ మెషీన్‌గా పేరొందాడు. ఇటీవల వన్డేల్లో 50 సెంచరీలు పూర్తి చేసుకుని సచిన్‌ టెండూల్కర్‌ రికార్డును తిరగరాశాడు. అంతేకాదు.. ఈ ఏడాది మరోసారి 2వేల పరుగుల మార్క్‌ను దాటి 146 ఏళ్ల క్రికెట్‌ చరిత్రలో తొలిసారి అత్యధిక సార్లు 2వేల పరుగులు చేసిన బ్యాటర్‌గా అవతరించాడు. ఇక మరోవైపు లెజెండరీ ఫుట్‌బాలర్‌ లియోనల్‌ మెస్సీ కూడా ఈ ఏడాది అద్భుతంగా రాణించాడు. వరుసగా గోల్స్‌ సాధించాడు. అయితే.. వీరిద్దరూ ఇప్పుడు ఒక ప్రతిష్టాత్మక అవార్డు కోసం పోటీ పడుతున్నారు. అదే 'ఫుబిటి అథ్లెట్‌ ఆఫ్‌ ది ఇయర్‌-2023.' ఈ రేసులో విరాట్, మెస్సీ నువ్వా నేనా అన్నట్లు పోటీ కనబడుతోంది.

విరాట్ కోహ్లీ, మెస్సీ ఇద్దరూ తమతమ ఆటల్లో మేటిగా రాణించారు. ఒకరు మైదానంలో పరుగుల వరద పారిస్తే.. మరొకరు గోల్స్‌తో వర్షం కురిపించారు. పరస్పరం విరుద్ధ స్వభావం కలిగిన వీరిద్దరిలో విజేతగా ఎవరు నిలుస్తారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.

సొంత గడ్డపై జరిగిన వన్డే వరల్డ్‌ కప్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన సెంచరీతో కోహ్లీ.. సచిన్ రికార్డును అధిగమించాడు. అయితే.. రన్‌మెషీన్ జోరు చూస్తుంటే 100 సెంచరీల రికార్డును కూడా బ్రేక్ చేసేలా కనిపిస్తున్నాడు. మరో 21 సెంచరీలు చేస్తే వరల్డ్‌లోనే అత్యధిక శతకాలు చేసిన క్రికెటర్‌గా విరాట్‌ కోహ్లీ నిలుస్తాడు. మరోవైపు నిరుడు ఖతర్‌లో జరిగిన వరల్డ్‌ కప్‌లో మెస్సీ అద్బుతం చేశాడు. అర్జెంటీనాను రెండోసారి ఫైనల్‌కు తీసుకెళ్లి.. ఈ దిగ్గజ ఫుట్‌బాలర్‌ సగర్వంగా వరల్డ్‌ కప్ ట్రోఫీని ముద్దాడాడు. టైటిల్‌ పోరులో అర్జెంటీనా4-2తో ఫ్రాన్స్‌ను ఓడించింది. మెస్సీ రెండు గోల్స్ చేసి జట్టు విజయంలో కీలక పాత్రను పోషించాడు. దాంతో.. 36 ఏళ్ల తర్వాత అర్జెంటీనా వరల్డ్‌ చాంపియన్‌గా అవతరించింది. ఈ ఏడాది అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకున్న‌ మెస్సీని ప్ర‌తిష్ఠాత్మ‌క‌ ‘బాల‌న్ డీ ఓర్' అవార్డు వ‌రించింది. మెస్సీ రికార్డు స్థాయిలో ఎనిమిదోసారి ఈ అవార్డును అందుకోవ‌డం విశేషం.

కాగా.. ఈ ప్యూబిటీ అథ్లెట్‌ ఆఫ్‌ ది ఇయర్‌-2023 అవార్డు కోసం చాలా మంది క్రీడాకారులు పోటీ పడ్డారు. కానీ.. చివరకు వీరిద్దరే మిగిలారు. చివరగా రేసులో ఎవరు గెలుస్తారనేదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. కోహ్లీ, మెస్సీ ఇద్దరిలో ఓటింగ్‌ ద్వారా ఎవరినో ఒకరిని త్వరలోనే విజేతగా ప్రకటించనున్నారు.


Next Story