కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డు.. సచిన్ ఘనతను బ్రేక్ చేసిన విరాట్
శ్రీలంకపై 34 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కోహ్లీ రికార్డు క్రియేట్ చేశాడు.
By Srikanth Gundamalla Published on 2 Nov 2023 5:24 PM ISTకోహ్లీ ఆల్‌టైమ్ రికార్డు.. సచిన్ ఘనతను బ్రేక్ చేసిన విరాట్
వన్డే వరల్డ్ కప్-2023లో టీమిండియా వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఒక్కో మ్యాచ్‌లో ఒక్కో ప్లేయర్ రికార్డులను తిరగరాస్తున్న విసయం తెలిసిందే. ఈ క్రమంలో శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో ఘనతను సాధించాడు. వన్డేల్లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో వెయ్యికి పైగా పరుగులు ఎక్కువ సార్లు చేసిన ఆటగాడిగా నిలిచాడు. వన్డే వరల్డ్ కప్-2023లో భాగంగా శ్రీలంకపై 34 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కోహ్లీ ఈ రికార్డును బ్రేక్ చేశాడు.
శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సూపర్ ఇన్నింగ్స్‌ను ఆడాడు. 88 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. అయితే.. ఈ మ్యాచ్‌లో విరాట్ మరో రికార్డును కూడా అందుకుంటాడని అందరూ అనుకున్నాడు. ఇప్పటి వరకు 49 సెంచరీలు చేసిన సచిన్ రికార్డును విరాట్ కోహ్లీ సమం చేస్తాడని అనుకున్నారు. కానీ.. అనూహ్యంగా విరాట్ 88 పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరాడు. కానీ.. 34 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద వన్డేల్లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో వెయ్యికి పైగా పరుగులు అత్యధిక సార్లు చేసిన బ్యాటర్‌గా విరాట్ నిలిచాడు.
కోహ్లి ఇప్పటివరకు 8 సార్లు ఒక క్యాలెండర్ ఇయర్‌లో 1000కుపైగా పరుగులు సాధించాడు. కాగా ఇప్పటివరకు ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. సచిన్ తన వన్డే కెరీర్‌లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో 7 సార్లు 1000కు పైగా పరుగులు నమోదు చేశాడు. తాజా మ్యాచ్‌తో మాస్టర్ బ్లాస్టర్ ఆల్‌టైమ్ రికార్డును కింగ్ కోహ్లి బ్రేక్ చేశాడు. ఓవరాల్‌గా ఇప్పటివరకు 288 వన్డేలు ఆడిన విరాట్.. 58.19 సగటుతో 13,499 పరుగులు సాధించాడు. అతడి వన్డే కెరీర్‌లో 48 సెంచరీలు, 70 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ప్రస్తుతం వన్డేల్లో ఒక ఏడాది వెయ్యి పరుగులు అత్యధిక సార్లు పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు.
ఈ ఏడాదితో పాటు గతంలో 2011, 2012, 2013, 2014, 2017, 2018, 2019 సంవత్సరాలలో కోహ్లీ 1000కి పైగా పరుగులు చేశాడు. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ వన్డేల్లో 1994, 1996, 1997, 1998, 2000, 2003, 2007 సంవత్సరాలలో ఈ ఘనత సాధించాడు. ప్రస్తుతానికి 288 వన్డేల్లో కోహ్లీ ఖాతాలో 70వ హాఫ్ సెంచరీ చేరింది.