విరాట్‌కు మరో ఐసీసీ అవార్డు.. తొలి ఆటగాడిగా రికార్డు
2023 ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు విరాట్ కోహ్లీ ఎంపిక అయ్యాడు.
By Srikanth Gundamalla Published on 25 Jan 2024 7:45 PM ISTవిరాట్‌కు మరో ఐసీసీ అవార్డు.. తొలి ఆటగాడిగా రికార్డు
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతడు చేజ్ మాస్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాదు.. అత్యధిక పరుగులు చేస్తూ రన్ మెషీన్‌గా పేరు సంపాదించాడు. అతని పేరిట ఎన్నో రికార్డులు ఉన్నాయి. అయితే.. తాజాగా 2023 ఏడాదికి గాను ఐసీసీ నుంచి మరో అవార్డు దక్కింది. 2023 ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు విరాట్ కోహ్లీ ఎంపిక అయ్యాడు. విరాట్ కోహ్లీకి ఈ అవార్డు గతంలో 2012, 2017, 2018లో కూడా వచ్చింది. నాలుగు సార్లు వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అందుకున్న ఆటగాడిగా కింగ్ విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు.
కాగా.. ఐసీసీ నుంచి విరాట్‌కు వచ్చిన ఈ అవార్డుతో కలిపి మొత్తం సంఖ్య 10కి చేరింది. ఈ క్రమలో ఐసీసీ నుంచి ఏకంగా పది అవార్డులు అందుకున్న తొలి ఆటగాడిగా ఘనత సాధించాడు. అయితే.. ఈ జాబితాలో మరే ఆటగాడు ఐదు అవార్డులు కూడా అందుకోలేదు. కుమార సంగక్కర (శ్రీలంక, 4 అవార్డులు) ఎంఎస్ ధోనీ (భారత్, 4 అవార్డుల)తో తర్వాత స్థానాల్లో ఉన్నారు. విరాట్ కోహ్లీ ఏకంగా 10 అవార్డులు అందుకోవడంతో రికార్డు నెలకొల్పాడు.
2023లో విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించాడు. 24 ఇన్నింగ్సుల్లో 72.47 సగుటుతో 1377 పరుగులు చేశాడు. వన్డే వరల్డ్ కప్‌లో 765 పరుగులు చేసి టోర్నీలో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. వరల్డ్ కప్‌లో మూడు సెంచరీలు, ఆరు ఆఫ్ సెంచరీలు నమోదు చేశాడు. ఇక న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లో శతకం బాది వ్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచాడు. అతడి సారథ్యంలో ఆస్ట్రేలియా గతేడాది డబ్ల్యూటీసీ ఛాంపియన్‌షిప్, వన్డే ప్రపంచకప్‌ను అందుకుంది. ఆసీస్ బ్యాటర్ ఉస్మాన్ ఖవాజా టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌కు ఎంపికయ్యాడు. 2023లో అతడు 13 టెస్టుల్లో 1210 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్‌కు చెందిన రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ అంపైర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకోనున్నాడు.