కోహ్లీ చేసిన దాంట్లో తప్పేముంది?: గవాస్కర్, క్రిష్ణమాచారి

బంగ్లాదేశ్‌పై విరాట్‌ సెంచరీ సాధించాడు. దీనిపై వస్తోన్న విమర్శలపై సునీల్‌ గవస్కార్‌, కృష్ణమాచారి స్పందించారు.

By Srikanth Gundamalla  Published on  20 Oct 2023 1:59 PM IST
virat kohli, century,  bangladesh, gavaskar, srikkanth,

కోహ్లీ చేసిన దాంట్లో తప్పేముంది?: గవాస్కర్, క్రిష్ణమాచారి 

భారత్‌ వేదికగా వన్డే వరల్డ్‌ కప్-2023 టోర్నీ కొనసాగుతోంది. ఈ టోర్నీలో వరుస విజయాలతో టీమిండియా దూసుకెళ్తోంది. గురువారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలిచి 4వ విజయాన్ని భారత్‌ ఖాతాలో వేసుకుంది. అయితే.. చాలా కాలం తర్వాత విరాట్‌ కోహ్లీ ఈ మ్యాచ్‌లో సెంచరీ చేశాడు. 97 బంతుల్లో 103 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. విరాట్‌ సెంచరీ చేయాలని అభిమానులంతా కోరుకున్నారు. అలాగే కింగ్‌ కోహ్లీ శతకం బాదేశాడు. విరాట్ సెంచరీ చేసినా.. విమర్శలను ఎదుర్కోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సెంచరీ చేసేందుకే స్ట్రయిక్‌ రొటేట్‌ చేయకుండా స్వార్ధంగా ఆడాడంటూ పలువురు విరమ్శలు చేస్తున్నారు. అంతేకాదు.. కోహ్లీ సెంచరీ చేసేందుకు అంపైర్‌ రిచర్డ్‌ కెటిల్‌బొరొ వైడ్‌ ఇవ్వకుండా సహకరించాడని నెటిజన్స్‌ సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ చేస్తున్నారు.

ఈ విమర్శలపై భారత క్రికెట్‌ మాజీ ప్లేయర్లు సునీల్‌ గవస్కార్‌, కృష్ణమాచారి స్పందించారు. విమర్శకులకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ప్రతిరోజూ సెంచరీ చేసే అవకాశం రాదు అని.. విరాట్‌ కోహ్లీ చేసిన దాంట్లో తప్పేముంది అని సునీల్ గవాస్కర్ ప్రశ్నించాడు. విరాట్‌ కోహ్లీ 70-80 స్కోరు వద్ద ఉన్నప్పుడు సెంచరీ చేసేందుకు అవకాశం ఉందని గ్రహించాడని చెప్పుకొచ్చాడు. దాంతో.. ఆ అవకాశాన్ని వదులుకోవద్దనే భావించాడని.. అందుకు కేఎల్‌ రాహుల్‌ కూడా ప్రోత్సహించాడని సునీల్ గవాస్కర్‌ తెలిపాడు. దాంట్లో తప్పేముందంటూ ప్రశ్నించాడు. ఏ ఆటగాడికైనా ప్రతి రోజూ సెంచరీ చేసే అవకాశం రాదనీ..కోహ్లీ తన సెంచరీ పూర్తి చేశాడని చెప్పాడు గవాస్కర్. కోహ్లీ 74 పరుగులతో ఉన్నప్పుడు భారత్ విజయానికి 27 పరుగులు అవసరం. ఆ తర్వాత కేఎల్ రాహుల్‌ ఒక్క బంతి మాత్రమే ఆడాడు. మరోవైపు విరాట్ 97 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద ఉండగా.. బంగ్లా బౌలర్‌ నసుమ్‌ అహ్మద్‌ లైగ్‌ సైడ్‌ దిశగా వైడ్‌ బాల్‌ వేశాడు. దాన్ని అంపైర్‌ రిచర్డ్‌ కెటిల్‌బొరో వైడ్ ఇవ్వలేదు.

ఇదే విషయంపై క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ స్పందించాడు. క్రికెట్‌ను అర్థం చేసుకోని వ్యక్తులను ప్రశ్నిస్తున్నా అంటూ ఎక్స్‌ (ట్విట్టర్) వేదికగా పోస్టు పెట్టారు. విరాట్ కోహ్లీ చేసిన దాంట్లో తప్పేముందని ప్రశ్నించాడు. ప్రపంచ కప్‌లో సెంచరీ చేయడం మామూలు విషయం కాదనీ.. సెంచరీ చేసేందుకు కోహ్లీ అర్హుడని పేర్కొన్నాడు క్రిష్ణమాచారి శ్రీకాంత్. టీమ్‌ మ్యాన్‌ కేఎల్‌ రాహుల్‌కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపాడు. అలాగే గతంలో చెన్నైలో ఆస్ట్రేలియాపై రాహుల్‌ అద్భుతంగా రాణించాడని గుర్తు చేశాడు క్రిష్ణమాచారి శ్రీకాంత్.

Next Story