500వ మ్యాచ్‌లో సెంచరీ, ఒత్తిడిలోనూ టీమ్‌ కోసం నిలబడతానన్న విరాట్

విదేశాల్లో తన రెకార్డు ఏమీ దారుణంగా లేదని, 15 సెంచరీలు కొట్టానని విరాట్‌ చెప్పాడు.

By Srikanth Gundamalla  Published on  22 July 2023 3:45 AM GMT
Virat Kohli,  500th Match, Century, IND Vs WI

 500వ మ్యాచ్‌లో సెంచరీ, ఒత్తిడిలోనూ టీమ్‌ కోసం నిలబడతానన్న విరాట్

వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో స్టార్‌ బ్యాటర్ విరాట్‌ కోహ్లీ రాణించాడు. అతనికి 500వ అంతర్జాతీయ మ్యాచ్‌ కావడం.. ఈ మ్యాచ్‌లో సెంచరీ చేయడంతో మ్యాచ్‌ జ్ఞాపకార్థంగా మిగిలిపోయింది. అయితే.. టెస్టు కెరీర్‌లో ఇది విరాట్‌కు 29వ సెంచరీ. చివరిసారి విదేశాల్లో 2018 డిసెంబర్‌లో ఆసీస్‌పై శతకం కొట్టాడు. ఈ క్రమంలో మ్యాచ్‌ తర్వాత విరాట్‌ కోహ్లీ ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. విదేశాల్లో తన రెకార్డు ఏమీ దారుణంగా లేదని, 15 సెంచరీలు కొట్టానని చెప్పాడు.

తొలి టెస్టులో భారత బౌలర్ల ధాటికి రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ తక్కువ స్కోరుకే ఆలౌటై ఇన్నింగ్స్‌ తేడాతో చిత్తుగా ఓడిన విండీస్‌.. రెండో టెస్టులో మాత్రం ప్రతిఘటిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 86/1 స్కోరుతో నిలిచింది. ఓవర్‌ నైట్‌ స్కోరు 288/4తో రెండో రోజు ఆటను కొనసాగించిన భారత్.. మొదటి ఇన్నింగ్స్‌లో 438 పరుగులకు ఆలౌటైంది.

ఈ క్రమంలోనే విరాట్‌ కోహ్లీ మాట్లాడుతూ.. దాదాపు ఐదేళ్ల తర్వాత సెంచరీ సాధించానని చెబుతున్నారు. కానీ ఇలా మాట్లాడుకోవడానికి మాత్రమే బాగుంటుందని చెప్పాడు. విదేశాల్లో తాను 15 సెంచరీలు చేశానని చెప్పాడు విరాట్. ఇదేమీ చెత్త రికార్డు కాదని అన్నాడు. సొంత గడ్డపై కంటే ఇతర దేశాల్లోనే ఎక్కువ సెంచరీలు నమోదు చేశానని గుర్తు చేశాడు. నాలుగున్నరేళ్లలో విదేశాల్లో ఎక్కువ మ్యాచ్‌లు కూడా జరగలేదని చెప్పాడు. అయితే.. తన ఖాతాలో ఎక్కువగా హాఫ్‌ సెంచరీలు ఉన్నాయని విరాట్‌ కోహ్లీ అన్నాడు. జట్టు కోసం తన నుంచి కావాల్సిన సహకారం అందించేందుకు ఎప్పుడూ ప్రయత్నిస్తానని చెప్పాడు. ఏదైనా మ్యాచ్‌లో 50కి పైగా పరుగులు చేసి ఔట్‌ అయితే.. సెంచరీ మిస్‌ అయ్యిందని బాధపడతానని చెప్పాడు. ఇక 120కి పైగా పరుగులు చేసి ఔట్‌ అయితే డబుల్‌ సెంచరీ మిస్‌ అయ్యిందని అనుకుంటానని విరాట్‌ కోహ్లీ అన్నాడు. తన కెరీర్‌లో ఎన్నో మైలురాళ్లను చూశానని.. తన ప్రదర్శన జట్టుకు ఉపయోగపడిందనే దాన్నే చూస్తానని విరాట్‌ కోహ్లీ చెప్పాడు.

కాగా.. భారత్‌ తరఫున అంతర్జాతీయ స్థాయిలో 500 మ్యాచ్‌లు ఆడటం గర్వంగా ఉందని అన్నాడు కింగ్‌ కోహ్లీ. అన్ని ఫార్మట్లలోనూ ఆడగల సత్తా తనలో ఉందనరి చెప్పాడు. త్వరగా ఒక ఫార్మాట్‌ నుంచి మరో ఫార్మాట్‌లోకి మారిపోగలనని చెప్పాడు. ఫిట్‌నెస్‌ బాగుండటం వల్లే ఇది సాధ్యమవుతోందని వివరించాడు. ఇక తనకు ఇష్టమైన పిచ్‌ల గురించి కూడా ఈ సందర్భంగా విరాట్‌ కోహ్లీ మాట్లాడాడు. ట్రినిడాడ్‌ పిచ్‌తో పాటు అటింగ్వా గ్రౌండ్‌ తనకు ఇష్టమని చెప్పాడు. ఆసీస్‌లోని అడిలైడ్‌, దక్షిణాఫ్రికాలోని బుల్‌రింగ్‌ పిచ్‌లో ఆడటం సంతోషంగా ఉంటుందని విరాట్‌ కోహ్లీ చెప్పాడు.


Next Story