ఐపీఎల్‌లోకి రెండు కొత్త టీమ్స్.. బీసీసీఐ గ్రీన్ సిగ్నల్..!
Two new teams into the IPL.. కరోనా కారణంగా ఐపీఎల్ 2020 సీజన్ ను యూఏఈలో నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే.
By సుభాష్ Published on 3 Dec 2020 10:43 AM GMTకరోనా కారణంగా ఐపీఎల్ 2020 సీజన్ ను యూఏఈలో నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ సీజన్ సూపర్ సక్సెస్ కావడంతో బీసీసీఐ(భారత క్రికెట్ నియంత్రణ మండలి) ఆనందంలో ఉంది. ఐపీఎల్ 14వ సీజన్‌ను భారత్‌లోనే నిర్వహించనున్నట్లు ఇప్పటికే బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలి చెప్పాడు. రానున్న సీజన్‌లో మరో రెండు కొత్త జట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అహ్మదాబాద్ సిటీ వేదికగా ఒక జట్టుతో పాటు మరో టీమ్‌ను చేర్చాలనే ప్రతిపాదనకు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ మేరకు డిసెంబర్ 24న జరగబోయే వార్షిక సర్వసభ్య సమావేశంలో బీసీసీఐ దీనిపై తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ సమావేశం కోసం 23 పాయింట్లతో ఎజెండాను కూడా బోర్డు సిద్ధం చేసింది. 2020 ఐపీఎల్‌ను యూఏఈలో నిర్వహించడం ద్వారా వచ్చిన నష్టాన్ని ఈ కొత్త టీమ్స్‌తో రాబట్టుకోవాలన్నది బీసీసీఐ ఆలోచనగా కనిపిస్తోంది. ఇప్పటికే ఈ కొత్త టీమ్స్ కోసం పూర్తి స్థాయి వేలానికి సిద్ధంగా ఉండాలని అన్ని ఫ్రాంచైజీలకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సందేశం పంపించారు. వచ్చే ఏడాది మొదట్లోనే ఈ వేలం ఉండే అవకాశం ఉంది.
ఇక కొత్త జట్ల రాకను ఫ్రాంచైజీలు వ్యతిరేకిస్తున్నాయి. చాలా తక్కువ సమయం ఉన్నందున మెగా వేలానికి సిద్దం కాలేమని పేర్కొన్నాయి. ఈ అంశంపై కూడా బీసీసీఐ చర్చించాల్సి ఉంది. అలాగే భారత జట్టు భవిష్యత్తు ప్రణాళికపై కూడా ఓ నిర్ణయానికి రావాల్సి ఉంది. కొత్త జట్లు వస్తే లీగ్‌లో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఐదుగురు విదేశీ ఆటగాళ్లను ఆడించాలనే ప్రతిపాదన అతి ముఖ్యమైనది. ప్రస్తుతం తుది 11 మంది ఆటగాళ్లలో నలుగురు విదేశీ ఆటగాళ్లను మాత్రమే అనుమతిస్తున్నారు. కానీ కొంతకాలంగా ఆయా ఫ్రాంచైజీలు ఈ విషయంలో సడలింపులు ఉండాలని కోరుతున్నాయి. తాజాగా కొత్త జట్టు రాబోతుందనే ప్రచార నేపథ్యంలో ఫ్రాంచైజీలు ఈ డిమాండ్ బీసీసీఐ ముందు గట్టిగా వినిపిస్తున్నాయి. మరీ బీసీసీఐ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.