T20 World Cup: అవార్డులను ప్రకటించిన ఐసీసీ.. లిస్ట్ ఇదే

టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీ దాదాపు నెల రోజుల పాటు కొనసాగింది.

By Srikanth Gundamalla  Published on  30 Jun 2024 11:19 AM IST
t20 world cup 2024, awards,  icc ,

T20 World Cup: అవార్డులను ప్రకటించిన ఐసీసీ.. లిస్ట్ ఇదే

టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీ దాదాపు నెల రోజుల పాటు కొనసాగింది. అద్భుతమైన ఉత్కంఠభరిత మ్యాచ్‌లను ఈ టోర్నీలో చూశాం. చిన్న టీమ్‌లు కూడా పటిష్టంగా ఉన్న జట్లకు చుక్కలు చూపించాయి. కొన్ని రికార్డులు క్రియేట్ అయ్యాయి. భారత్ - దక్షిణాఫ్రికా మధ్య ఫైనల్ మ్యాచ్‌తో టోర్నీ సమాప్తం అయింది. బార్బడోస్‌వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా 7 పరుగులతో జయకేతనం ఎగురవేసి విశ్వవిజేతగా అవతరించింది. ఈ మ్యాచ్‌లో 76 పరుగుల చేసి విరాట్‌ కోహ్లీ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దాంతో.. అతనికి ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.

కాగా.. టోర్నమెంట్ ముగియడంతో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లకు టీ20 వరల్డ్ కప్ 2024 అవార్డులను ఐసీసీ ప్రకటించింది. భారత్‌ రెండోసారి టీ 20 వరల్డ్‌ కప్‌ను గెలుచుకుంది. ఇందుకు కీలక పాత్ర పోషించిన జస్ప్రీత్‌ బుమ్రాకు ప్లేయర్ ఆఫ్‌ ది టోర్నమెంట్‌ అవార్డు దక్కింది. ఈ టోర్నీలో బుమ్రా 15 వికెట్లను పడగొట్టి.. ఎకనామీ 4.17గా కొనసాగించాడు. ప్రత్యర్థుల బ్యాటర్లకు చుక్కలు చూపించి.. కట్టడి చేయగలిగాడు. భారత బౌలింగ్ దళానికి నాయకత్వం వహించడంతో బుమ్రాకు ఈ అవార్డు దక్కింది.

మరో భారత బౌలర్‌ అర్షదీప్‌ సింగ్ ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా ఉన్నాడు. అప్ఘాన్ బౌలర్ ఫజల్ హాక్‌ ఫారూఖీతో పాటుగా అగ్రస్థానంలో ఉన్నారు. వీళ్లిద్దరూ టోర్నీలో చెరో 17 వికెట్లు తీసుకున్నారు. సౌతాఫ్రికాతో పైనల్ మ్యాచ్‌లో అర్షదీప్‌ సింగ్ 3 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. మొత్తం 8 మ్యాచ్‌లు ఆడిన అతడు 17 వికెట్లతో నిలిచాడు. టీ20 వరల్డ్ కప్ హిస్టరీలో ఏ ఎడిషన్‌లోనైనా ఒక ఆటగాడికి ఇవే అత్యధిక వికెట్లుగా ఉన్నాయి. అత్యధిక పరుగులు చేసిన అప్ఘాన్‌ బ్యాటర్‌ రహ్మానుల్లా గుర్బాజ్‌ టాప్‌లో ఉన్నాడు. ఈ టోర్నీలో 281 పరుగులు సాధించాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ 257 పరుగులు, ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ 255 పరుగులు వరుసగా రెండు, మూడుస్థానాల్లో ఉన్నారు.

అవార్డు విజేతల జాబితా

* ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ - జస్ప్రీత్ బుమ్రా (15 వికెట్లు, ఎకానమీ రేటు 4.17)

* ఫైనల్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ - విరాట్ కోహ్లీ (76 పరుగులు)

* స్మార్ట్ క్యాచ్ ఆఫ్ ది ఫైనల్ - సూర్యకుమార్ యాదవ్

* అత్యధిక పరుగులు - రహ్మానుల్లా గుర్బాజ్ (281 పరుగులు)

* అత్యధిక వికెట్లు - అర్ష్‌దీప్ సింగ్, ఫజల్‌హాక్ ఫరూఖీ (17 వికెట్లు)

* అత్యధిక వ్యక్తిగత స్కోరు - నికోలస్ పూరన్ (98, ఆఫ్ఘనిస్థాన్‌పై)

* బెస్ట్ బౌలింగ్ గణాంకాలు - ఫజల్‌హాక్ ఫరూకీ (9 పరుగులకు 5 వికెట్లు, ఉగాండాపై)

* అత్యధిక స్ట్రైక్ రేట్ - షాయ్ హోప్ (187.71)

* బెస్ట్ ఎకానమీ రేట్ - టిమ్ సౌథీ (3.00)

* అత్యధిక సిక్సర్లు - నికోలస్ పూరన్ (17 సిక్సులు)

* అత్యధిక 50+ స్కోర్లు - రోహిత్ శర్మ, రహ్మానుల్లా గుర్బాజ్ (చెరో 3)

* అత్యధిక క్యాచ్‌లు - ఐడెన్ మార్క్‌రమ్ (8 క్యాచ్‌లు)

Next Story