ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు.. ఆంధ్రా కుర్రాడి రికార్డు (వీడియో)

ఆంధ్ర ఓపెనర్ మామిడి వంశీ కృష్ణ 6 బంతుల్లో ఆరు సిక్స్‌లు కొట్టాడు.

By Srikanth Gundamalla  Published on  22 Feb 2024 5:44 AM GMT
six sixes,  over, andhra boy, vamshi, bcci, video,

ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు.. ఆంధ్రా కుర్రాడి రికార్డు (వీడియో)

క్రికెట్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు బాదిన వారు తక్కువే ఉన్నారు. ఈ విషయం అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు యువరాజ్‌సింగ్. అయితే.. అంతకుముందు కూడా ఈ ఫీట్‌ను ఇతర ప్లేయర్లు అందుకున్నారు. తాజాగా ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లను బాదాడు మన ఆంధ్రా కుర్రాడు. కల్నల్‌ సీకే నాయుడు ట్రోఫీ జాతీయ అండర్-2023 క్రికెట్‌ టోర్నీలో ఆంధ్ర ఓపెనర్ మామిడి వంశీ కృష్ణ 6 బంతుల్లో ఆరు సిక్స్‌లు కొట్టాడు. ఈ టోర్నీలో భాగంగా రైల్వేస్ జట్టుతో ఆదివారం ప్రారంభమైన మ్యాచ్‌లో వంశీ ఈ రికార్డు నమోదు చేశాడు. రైల్వేస్‌ లెగ్‌ స్పిన్నర్ దమన్‌దీప్‌ సింగ్ వేసిన 10వ ఓవర్లో వరుసగా 6 సిక్స్‌లను బాదాడు వంశీ.

ఈ మ్యాచ్‌లో 64 బంతులను ఎదుర్కొన్న వంశీ కృష్ణ 9 ఫోర్లు, 10 సిక్స్‌లతో 110 పరుగులు చేశాడు. అయితే.. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ఎక్స్‌ వేదికగా షేర్‌ చేసింది. అలర్ట్‌ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కాగా.. ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన మూడో బ్యాటర్‌గా నిలిచాడు వంశీ కృష్ణ. ఇతని కంటే ముందే రవిశాస్త్రి, రుతురాజ్‌ గైక్వాడ్ భారత్ తరఫున ఈ ఫీట్‌ను క్రియేట్‌ ఏశారు. అంతర్జాతీయ క్రికెట్‌లో మాత్రం భారత్‌ తరఫున దిగ్గజ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌సింగ్ ఒక్కడే 6 బంతుల్లో ఆరు సిక్స్‌లో కొట్టాడు. 2007 టీ20 వరల్డ్‌ కప్‌లో ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో యువరాజ్‌సింగ్ వరుసగా ఆరు సిక్స్‌లు బాదాడు.

ఇక ఆంధ్ర-రైల్వేస్ మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. రైల్వేస్ ఇచ్చిన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సంపాదించడంతో మ్యాచ్ డ్రా అయ్యింది. మొదటి ఇన్నింగ్స్‌లో 378 పరుగులకు ఆలౌట్‌ కాగా.. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆడిన రైల్వేస్ 865 పరుగుల భారీ స్కోరు చేసింది. యాన్ష్ యాదవ్ (268), రవి సింగ్ (258) డబుల్ సెంచరీలతో చెలరేగారు.


Next Story