గిల్‌కు ICC అవార్డు.. ఏడాదిలో రెండుసార్లు గెలుచుకుని రికార్డు

గిల్‌ ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డు రెండు సార్లు దక్కించుకున్న తొలి భారత క్రికెటర్‌గా నిలిచాడు.

By Srikanth Gundamalla  Published on  15 Oct 2023 4:45 PM IST
shubman gill, icc award, two times record,

గిల్‌కు ICC అవార్డు.. ఏడాదిలో రెండుసార్లు గెలుచుకుని రికార్డు

శుభ్‌మన్‌ గిల్‌ టీమిండియాలో స్టార్‌ ప్లేయర్‌. ఓపెర్‌గా వస్తూ మంచి రన్స్‌ సాధిస్తున్నాడు గిల్. అయితే.. ఇటీవల డెంగ్యూ కారణంగా వరల్డ్‌ కప్‌లో రెండు మ్యాచ్‌లు ఆడలేదు. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడినా చెప్పుకోదగ్గ స్కోర్‌ చేయలేకపోయాడు. కానీ.. అతడి ఫామ్‌పై బీసీసీఐతో పాటు టీమిండియా అభిమానులందరికీ నమ్మకం ఉంది. ఎందుకంటే గతమ్యాచుల్లో అతడి ఆటను చూస్తే అది తెలిసిపోతుంది. అందుకే ఈ ఏడాది శుభ్‌మన్‌ గిల్‌ను ఐసీసీ అవార్డు వరించింది. గిల్‌ 2023 సెప్టెంబర్‌ నెలలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చినందుకు ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్ అవార్డును గెలుచుకున్నాడు. అయితే.. గిల్‌ ఈ అవార్డు గెలుచుకోవడం ద్వారా అరుదైన రికార్డును నెలకొల్పాడు. ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డు రెండు సార్లు దక్కించుకున్న తొలి భారత క్రికెటర్‌గా నిలిచాడు.

కాగా.. ఇదే ఏడాది జనవరిలో గిల్‌ తొలిసారి ఐసీసీ నుంచి ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డును అందుకున్నాడు. ఆ తర్వాత సెప్టెంబర్‌ నెలకు గాను మరోసారి ఈ అవార్డును దక్కించుకున్నాడు. దాంతో.. శుభ్‌మన్‌ గిల్‌ ఒకే ఏడాది రెండు సార్లు ఈ ఐసీసీ అవార్డును సాధించిన భారత తొలి ఆటగాడిగా నిలిచాడు. ఇక ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డును అత్యధిక సార్లు దక్కించుకున్న ఘనత పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజామ్ పేరున ఉంది. బాబర్‌ ఇప్పటి వరకు మూడు సార్లు ఈ అవార్డును దక్కించుకున్నాడు. ఇక బాబర్‌ ఆజామ్ తర్వాత ఇద్దరు ఆటగాళ్లు చెరో రెండు సార్లు గెలుచుకున్నారు బంగ్లాదేశ్ స్టార్ ప్లేయర్‌ షకీబ్‌అల్‌ హసన్‌ 2021 జులైలో తొలిసారి.. ఆ తర్వాత 2023 మార్చిలో రెండోసారి గెలుచుకున్నాడు. ఇంగ్లండ్ క్రికెటర్‌ హ్యారీ బ్రూక్‌ కూడా 2022 డిసెంబర్‌లో తొలిసారి, 2023 ఫిబ్రవరిలో రెండోసారి ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ది మంత్‌ గెలుచున్నాడు.

అయితే.. భారత్‌ నుంచి మాత్రం ఒకే ఏడాదిలో రెండు అవార్డులు దక్కించుకున్న ఆటగాడిగా గిల్‌ నిలిచాడు. భారత్‌ నుంచి రిషబ్‌ పంత్, అశ్విన్, భువనేశ్వర్‌ కుమార్, శ్రేయస్ అయ్యర్, విరాట్‌ ఒక్కోసారి ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్ అవార్డు దక్కించుకున్నారు. కాగా.. 2021 జనవరి నుంచే ఐసీసీ ఈ అవార్డులను అందజేస్తోంది. అప్పట్నించి తొలి మూడు నెలలు ఇండియన్‌ ఆటగాళ్లే దక్కించుకోవడం విశేషంగా నిలిచింది.

Next Story