రెజ్లర్ సాక్షి మాలిక్ సంచలన ప్రకటన

భారత మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్‌ సంచలన సంచలన ప్రకటన చేసింది.

By Srikanth Gundamalla
Published on : 21 Dec 2023 8:12 PM IST

sakshi malik, quit wrestling, sensational comments,

రెజ్లర్ సాక్షి మాలిక్ సంచలన ప్రకటన

భారత మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్‌ సంచలన సంచలన ప్రకటన చేసింది. ఆటకు తాను ఇక వీడ్కోలు చెబుతున్నట్లు వెల్లడించింది. బ్రిజ్‌ భూషణ్ శరణ్‌ సింగ్‌ వంటి వ్యక్తి అనుచరుడి నేతృత్వంలో తాను పోటీల్లో పాల్గొనలేనని చెప్పింది. ఇలా ఆడటం కంటే.. ఆటకు రిటైర్మెంట్‌ ప్రకటించడమే మేలు అని చెప్పింది మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్.

కాగా భారత రెజ్లింగ్‌ సమాఖ్య మాజీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలతో సాక్షి మాలిక్, వినేశ్‌ ఫొగట్‌ తదితర మహిళా రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద నెలరోజులకు పైగా నిరసన చేసిన విషయం తెలిసిందే. వీరికి బజరంగ్‌ పునియా, జితేందర్‌ వంటి పురుష రెజ్లర్లు మద్దతుగా నిలిచారు. అయితే.. అనేక పరిణామాల తర్వాత బ్రిజ్‌ భూషణ్‌ స్థానంలో కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరిగింది. ఢిల్లీలోని ఒలింపిక్‌ భవన్‌ వేదికగా గురువారం జరిగిన ఎన్నికల్లో బ్రిజ్ భూషణ్ విధేయుడు సంజయ్‌ కుమార్‌ సింగ్ గెలిచాడు. మహిళా రెజ్లర్లకు మద్దతుగా నిలిచిన మాజీ రెజ్లర్ అనితా షెరాన్‌పై అతను గెలుపొందాడు.

సంజయ్‌ కుమార్‌ గెలుపుపై రెజ్లర్‌ సాక్షి మాలిక్‌ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె తీవ్ర మనస్తాపాన్ని వ్యక్తం చేసింది. దాదాపు 40 రోజుల పాటు నిరసన వ్యక్తం చేస్తూ రోడ్లపై నిద్రించామని ఆమె చెప్పారు. దేశంలో నలమూలల నుంచి తమకు మద్దతు దొరికందని వెల్లడించింది. ఈ సందర్భంగా బ్రిజ్‌ భూషణ్ వ్యాపార భాగస్వామి, అనుచరుడు రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు అయితే..తాను రెజ్లింగ్‌నే వదిలేస్తానని చెప్పారు. మనస్తాపం చెందిన సాక్షి మాలిక్‌ కన్నీళ్లు పెట్టుకుంది. ఇక ఇదే మీడియా సమావేశంలో పాల్గొన్న బజరంగ్ పునియా మాట్లాడుతూ.. బ్రిజ్‌ భూషణ్ విశ్వాసపాత్రులెవరూ డబ్యూఎఫ్‌ఐ ఎన్నికల్లో పాల్గొనరంటూ ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయిందని అన్నాడు. ఇది దురదృష్టకరమైన విషయం అని అతను అన్నాడు.

Next Story