పాకిస్తాన్‌ను తక్కువ అంచనా వేయొద్దు: రవిశాస్త్రి
ఆసియాకప్-2023లో దాయాదుల పోరుకు సమయం ఆసన్నమైంది.
By Srikanth Gundamalla Published on 2 Sep 2023 2:44 AM GMTపాకిస్తాన్‌ను తక్కువ అంచనా వేయొద్దు: రవిశాస్త్రి
ఆసియాకప్-2023లో దాయాదుల పోరుకు సమయం ఆసన్నమైంది. కొన్ని గంటల్లోనే భారత్-పాకిస్తాన్ మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానులు ఎదురుచూస్తున్నారు. శ్రీలంకలోని పల్లెకెలె వేదికగా భారత్, పాక్ మధ్య మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది. అయితే.. ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశారు.
హైవోల్టేజ్ మ్యాచ్‌లో భారత్‌దే విజయం అని ముందుగానే దీమా వ్యక్తం చేశారు రవిశాస్త్రి. అయితే.. పాకిస్తాన్ టీమ్‌ను మాత్రం తక్కువ అంచనా వేయొద్దని సూచించారు. తనవరకు అయితే టీమిండియానే ఫేవరెట్ అని చెప్పారు. ప్రస్తుతం ఉన్న టీమిండియా 2011 ప్రపంచ కప్‌ను గెలిచిన టీమ్ కంటే బలంగా ఉందని వ్యాఖ్యానించారు. జట్టులో చాలా మంది అద్బుత ఆటగాళ్లు ఉన్నారని పేర్కొన్నారు. అదేవిధంగా రోహిత్ శర్మకు చాలా అనుభవం ఉందని.. ఇక అతడి కెప్టెన్సీలో భారత్ ఘన విజయం సాధించడం పక్కా అని అన్నారు. రోహిత్‌కు భారత ఉపఖండ పిచ్‌లపై అద్భుతమైన రికార్డు ఉందని రవిశాస్త్రి గుర్తు చేశారు.
పాకిస్తాన్‌ను మాత్రం తక్కువ అంచనా వేయొద్దని.. వారు కూడా గతంలో కంటే అద్భుతంగా ఆడుతున్నారని రవిశాస్త్రి చెప్పారు. ప్రస్తుతం ఉన్న పాకిస్తాన్ క్రికెట్ జట్టు చాలా బాగుందని.. ఏడు, ఎనిమిది ఏళ్ల క్రితం భారత్-పాక్ జట్ల మధ్య చాలా గ్యాప్ ఉండేదన్నారు. కానీ.. వారు నెమ్మదిగా తగ్గించుకుంటూ వస్తున్నారని తెలిపారు. అయితే.. పాకిస్తాన్ జట్టు కూడా నెంబర్ వన్ జట్టుగా ఉందని రవిశాస్త్రి అన్నారు. బౌలింగ్, బ్యాటింగ్ రెండు విభాగాల్లోనూ భారత్ రాణించాల్సిన అవసరం ఉందన్నారు. పాక్-భారత్ మ్యాచ్‌కి ముందు ఎవరి ఫామ్‌ను లెక్కించొద్దని..ఒత్తిడి తట్టుకుని ఆడినవారే విజయం సాధిస్తారని రవిశాస్త్రి అన్నారు. కాబట్టి ఎలాంటి పొరపాట్లు చేయకుండా ఆడాలని కచ్చితంగా పాకిస్తాన్ జట్టుని ఓడించవచ్చని రవిశాస్త్రి అన్నారు.
కాగా భారత్, పాక్‌లు తలపడిన గత ఐదు వన్డేల్లో టీమిండియాదే 4–1తో పైచేయిగా ఉంది. 2018 ఆసియాకప్‌లో రెండుసార్లు టీమిండియా గెలిచింది. చివరిసారిగా గత వన్డే ప్రపంచకప్(2019)లోనూ భారత్‌దే గెలుపు.