పారిస్ ఒలింపిక్స్‌లో ముగిసిన పీవీ సింధు పోరాటం
పారిస్ ఒలింపిక్స్‌లో భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు పోరాటం ముగిసింది.
By Srikanth Gundamalla Published on 2 Aug 2024 1:42 AM GMTపారిస్ ఒలింపిక్స్‌లో ముగిసిన పీవీ సింధు పోరాటం
పారిస్ ఒలింపిక్స్‌లో భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు పోరాటం ముగిసింది. గతంలో రియో ఒలింపిక్స్‌లో రజతం.. టోక్యోలో కాంస్యంతో యావత్ దేశం గర్వపడేలా చేసిన బాడ్మింటన్ పీవీ సింధూకు ఈసారి ఒలింపిక్స్‌లో నిరాశే ఎదురైంది. హ్యాట్రిక్ అంచనాలతో బరిలోకి దిగిన ఆమె ఓటమితో ఒలింపిక్స్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. క్వార్టర్స్‌కు చేరకుండానే ఇంటిదారి పట్టింది. గురువారం బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ప్రీక్వార్టర్స్‌లో చైనా ప్లేయర్ హే బిన్‌జియావో చేతిలో 19-21, 14-21తో పీవీ సింధు ఓడిపోయింది. వరుసగా రెండు గేమ్స్‌లో ఓడి టోర్నీ నుంచి తప్పుకుంది.
ఈ మ్యాచ్‌లో పీవీ సింధు అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. తొలి గేమ్‌లో ఇద్దరూ షట్లర్లు హోరాహోరీగా తలపడ్డారు. క్రాస్ కోర్ట్ షాట్స్‌తో సింధు చెలరేగగా.. స్మాష్‌లతో చైనా ప్లేయర్ సత్తా చాటింది. చివరకు చైనా ప్లేయర్ పై చేయి సాధించి 19-21 తేడాతో తొలి గేమ్‌ను దక్కించుకుంది. రెండో గేమ్ ఆరంభం నుంచే దూకుడు కనబర్చిన బింగ్‌జావ్ వరుస పాయింట్స్‌తో సింధుపై ఒత్తిడిని పెంచింది. భారత షట్లర్ అనసవర తప్పిదాలను క్యాష్ చేసుకున్న చైనా ప్లేయర్ 16-8తో ఆధిక్యం సాధించింది. మధ్యలో సింధు పుంజుకొని పాయింట్స్ సాధించినా.. చైనా ప్లేయర్ పట్టు వదల్లేదు. చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకొని రెండో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. ఈ విజయంతో క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. కాగా, టోక్యో ఒలింపిక్స్‌లో సింధూ ఇదే బిన్‌జియావోను ఓడించి కాంస్య పతకాన్ని అందుకుంది. దేశానికి మూడో ఒలింపిక్స్ పతకం అందించే అవకాశం చేజారడంతో సింధు నిరాశ వ్యక్తం చేసింది. తొలి గేమ్‌లో గెలిచి ఉంటే ఫలితం మరోలా ఉండేదని వ్యాఖ్యానించింది. తొలి గేమ్ గెలిచిన కాన్ఫిడెన్స్‌తో ఫలితం మరోలా ఉండి ఉండేదని చెప్పింది.