సెమీ ఫైనల్‌లో పీవీ సింధు మళ్లీ ఓటమి
కెనడా ఓపెన్ సెమీ ఫైనల్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు నిరాశ పరిచింది.
By Srikanth Gundamalla Published on 9 July 2023 11:50 AM ISTసెమీ ఫైనల్‌లో పీవీ సింధు మళ్లీ ఓటమి
కెనడా ఓపెన్ సెమీ ఫైనల్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు నిరాశ పరిచింది. ఆదివారం ఉదయం జరిగిన సెమీఫైనల్‌లో జపాన్‌కు చెందిన అకానే యమగుచి చేతిలో పీవీ సింధు ఓడిపోయింది. 14-21, 15-21 తేడాతో యమగుచిపై పీవీ సింధు ఓటమి పాలైంది. రెంగు గేమ్స్‌లోనూ సింధుపై యమగుచి ఆధిపత్యం చలాయించింది. యమగుచి చేతిలో పీవీ సింధు ఓడిపోవడం ఇది రెండోసారి కావడం గమనార్హం. సింగపూర్ ఓపెన్-2023లో తొలిరౌండ్‌లోనే సింధుని జపాన్ స్టార్ షెట్లర్ ఓడించింది. గాయం నుంచి కోలుకున్నాక పీవీ సింధు ప్రదర్శించలేకపోతోందని క్రీడా నిపుణులు అంటున్నారు. ఇక పీవీ సింధు బీడబ్ల్యూఎఫ్ ప్రకటించిన ర్యాంకింగ్స్‌లోనూ మూడు స్థానాలు కిందకు వెళ్లి 15వ ర్యాంకులో కొనసాగుతోంది. చాలా రోజులుగా టైటిల్ కోసం ఎదురు చూస్తోన్న పీవీ సింధుకు కెనడా ఓపెన్ సెమీ ఫైనల్‌లో మరోసారి నిరాశ ఎదురైంది.
ఒక వైపు పీవీ సింధు నిరాశపరిచినప్పటికీ.. మరో భారత షెట్లర్ లక్ష్యసేన్ మాత్రం అదరగొట్టాడు. కెనడా ఓపెన్ ఫైనల్‌లోకి లక్ష్యసేన్ అడుగుపెట్టాడు. సెమీ ఫైనల్‌లో జపాన్‌కు చెందిన కెంటా నిషిత్మోటోను 21-17, 21-14 వరుస గేమ్‌లలో ఓడించాడు లక్ష్యసేన్. ఈ విజయంతో దాదాపు ఏడాది తర్వాత బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. ఫైనల్‌లో లక్ష్యసేన్ చైనాకు చెందిన లీ షిపెంగ్‌తో తలపడనున్నాడు.