ఆ తప్పులు చేయకుండా ఉండాల్సింది: పీవీ సింధు
ఒలింపిక్స్‌లో మూడోసారి పతకమే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు పోరాటం ముగిసింది.
By Srikanth Gundamalla Published on 2 Aug 2024 5:45 AM GMTఆ తప్పులు చేయకుండా ఉండాల్సింది: పీవీ సింధు
ఒలింపిక్స్‌లో మూడోసారి పతకమే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు పోరాటం ముగిసింది. ఆమె ప్రీక్వార్టర్స్‌లో ఓడిపోయింది. దాంతో.. పారిస్ ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. కాగా.. పీవీ సింధు రియో ఒలింపిక్స్‌లో రజతం , టోక్యో విశ్వక్రీడల్లో కంచు మోత మోగించిన విషయం తెలిసిందే. పారిస్ ఒలింపిక్స్‌లో గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో చైనా షట్లర్ హే బింగ్‌జావ్ చేతిలో 19-21, 14-21 తేడాతో ఓటమిపాలై పివీ సింధు నిష్క్రమించింది.
ప్రీ క్వార్టర్స్‌లో పీవీ సింధు, హే బింగ్‌జావ్ మద్య తొలి గేమ్ హోరాహోరీగా సాగింది. అంతిమంగా తొలి గేమ్‌ను చైనా ప్లేయర్ చేజిక్కుంచుకుంది. రెండో గేమ్‌లో ప్రత్యర్థిని సింధు ప్రతిఘటించలేకపోయింది. ఆఖర్లో సింధు పుంజుకున్నా లాభం లేకపోయింది. చివరకు వరుసగా రెండు సెట్లలో గెలిచిన బింగ్‌జావ్ తర్వాత రౌండ్‌కు క్వాలిఫై అయ్యింది. పీవీ సింధు పారిస్ ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించింది. పీవీ సింధు అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. క్రాస్ కోర్ట్ షాట్స్‌తో సింధు, స్మాష్‌లతో చైనా ప్లేయర్ సత్తా చాటింది.
అయితే.. ప్రీక్వార్టర్స్‌లో ఓటమిపై పీవీ సింధు స్పందించింది. అలాగే వచ్చే ఒలింపిక్స్ వరకు కొనసాగుతుందా లేదా అనే విషయాలు గురించి మాట్లాడింది. వచ్చే ఒలింపిక్స్‌కు ఇంకా నాలుగేళ్ల సమయం ఉందని సింధు అన్నది. ప్రస్తుతం కాస్త విశ్రాంతి తీసుకుంటానని చెప్పింది. ఆ తర్వాత ఆలోచిస్తానంటూ పేర్కొంది. అయితే.. పారిస్ ఒలింపిక్స్‌లో ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయానని బాధపడింది. తనని నిరాశ చెందానంది. మొత్తంగా మ్యాచ్‌లో నా తప్పులను నియంత్రించాల్సిందనీ.. ముఖ్యంగా రెండో గేమ్‌లో తప్పులు చేశానని అన్నది పీవీ సింధు. తొలి గేమ్‌లో ఓ దశలో 19-19తో సమానంగా ఉన్నా, దాన్ని విజయంగా ముగించలేకపోవడం బాధగా ఉందని పేర్కొంది. ప్రతి పాయింట్ కోసం పోరాడానని తెలిపింది. సులభంగా పాయింట్లు వస్తాయని, సులభమైన పోటీ ఉంటుందని భావించలేమని ఈ సందర్భంగా పీవీ సింధు తెలిపింది. కొన్ని స్మాష్‌లు కోర్టు బయటపడ్డాయని గుర్తు చేసుకుంది. దాన్ని లోపలకి కొట్టి ఉంటే పాయింట్లు దక్కేవని చెప్పింది. నివారించదగిన కొన్ని తప్పులు కొనసాగాయని... అవి ప్రత్యర్థిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయని పీవీ సింధు పేర్కొంది.