పీఎస్‌ఎల్‌ ప్రైజ్ మనీ.. ఐపీఎల్‌లో ఆ జ‌ట్టుకంటే త‌క్కువ‌గా..!

PSL Prize money I పీఎస్‌ఎల్‌ ప్రైజ్ మనీ.. క‌రోనా మ‌హమ్మారి కార‌ణంగా వాయిదా ప‌డిన పాకిస్థాన్ ప్రీమియ‌ర్ లీగ్‌(పీఎస్ఎల్) టోర్నీ

By సుభాష్  Published on  18 Nov 2020 1:31 PM GMT
పీఎస్‌ఎల్‌ ప్రైజ్ మనీ.. ఐపీఎల్‌లో ఆ జ‌ట్టుకంటే త‌క్కువ‌గా..!

క‌రోనా మ‌హమ్మారి కార‌ణంగా వాయిదా ప‌డిన పాకిస్థాన్ ప్రీమియ‌ర్ లీగ్‌(పీఎస్ఎల్) టోర్నీ ఎట్ట‌కేల‌కు పూరైంది. ఈ టోర్నీ లీగ్ మ్యాచ్‌లు మార్చిలో జ‌ర‌గ‌గా.. ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు న‌వంబ‌ర్‌లో పూర్తీ అయ్యాయి. మంగళవారం జరిగిన ఫైనల్ మ్యాచులో కరాచీ కింగ్స్‌ 5 వికెట్ల తేడాతో లాహోర్‌ ఖలందర్స్‌ను ఓడించింది. పాకిస్థాన్ స్టార్ ఆటగాడు బాబర్ ఆజమ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడడంతో కరాచీ తొలిసారి పీఎస్‌ఎల్‌ టైటిల్‌ను ముద్దాడింది.

మార్చిలో పూర్తవ్వాల్సిన పీఎస్‌ఎల్‌ ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు కరోనా మహమ్మారి కారణంగా నిలిచిపోయాయి. ఆ తర్వాత ఐపీఎల్ 2020 సీజన్ అడ్డంకిగా నిలిచింది. చివరకు ఐపీఎల్ ముగియడంతో పీఎస్‌ఎల్‌కు లైన్ క్లియర్ అయింది. మంగళవారం రాత్రి జరిగిన ఫైనల్‌తో పీఎస్‌ఎల్ 2020 సీజన్‌కు సక్సెస్‌ఫుల్‌గా పూరైంది.

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన లాహోర్ ఖలందర్స్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ (38 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్‌తో 35) మినహా ఎవరూ పెద్దగా రాణించకపోవడంతో ఓ మోస్తరు స్కోరు మాత్రమే చేయగలిగింది లాహోర్. లక్ష్యచేధనకు దిగిన కరాచీ కింగ్స్ 18.4 ఓవర్లలో 5 వికెట్లకు 135 పరుగులు చేసి 8 బంతులు మిగిలుండగానే విజయాన్నందుకుంది. చేద‌న‌లో కరాచీ కింగ్స్ టాపార్డర్ పూర్తిగా విఫలమవడంతో ఓ దశలో లాహోర్ విజయం సాధించేలా కనిపించింది. షర్జీల్ (13), అలెక్స్ హేల్స్ (11), ఇఫ్తికర్ అహ్మద్ (4), రూథర్‌ఫర్డ్ (0) విఫలమయ్యారు. లక్ష్యం మరీ ఎక్కువగా లేకపోవడంతో బాబర్ అజామ్ (49 బంతుల్లో 7 ఫోర్లతో 63 నాటౌట్) చివరి వరకూ క్రీజులో నిలవడంతో మొదటిసారి టైటిల్ ను అందుకుంది

పీఎస్ఎల్ ప్రారంభమైన నాటి నుంచి ప్రతి విషయంలో ఈ లీగ్‌ను ఐపీఎల్‌‌తో పోల్చుతున్నారు. ఐపీఎల్‌‌తో పోల్చుకుంటే పీఎస్ఎల్ ఎందులోనూ కాద‌ని ప‌లువురు పాకిస్థాన్ మాజీ క్రికెట‌ర్లు వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే. ప్రపంచంలోనే బలమైన క్రికెట్ బోర్డు అయిన బీసీసీఐ కనుసన్నల్లో నడుస్తోన్న ఐపీఎల్‌‌లో ప్రైజ్ మనీ, ఆటగాళ్లకు ఇచ్చే వేతనాలు, స్పాన్సర్ల ద్వారా వచ్చే ఆదాయం భారీ మొత్తంలో ఉంటుంది. పీఎస్‌ఎల్‌లో మాత్రం ఇలా ఉండదు.

యూఏఈ వేదికగా ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 2020 విజేత ముంబై ఇండియన్స్ జట్టుకు రూ.20 కోట్లు ప్రైజ్ మనీ దక్కింది. రన్నరప్‌గా నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రూ.12.5 కోట్లు అందుకుంది. ఇక పీఎస్‌ఎల్ 2020 విజేతగా నిలిచిన కరాచీ కింగ్స్ జట్టుకు రూ.3.75 కోట్లు.. రన్నరప్‌గా నిలిచిన లాహోర్ ఖలందర్స్ జట్టు‌కు రూ.1.5 కోట్ల చొప్పున ప్రైజ్ మనీ దక్కింది. అంటే ఐపీఎల్ ప్రైజ్ మనీ దాదాపు పీఎస్‌ఎల్ కంటే ఆరు రెట్లు ఎక్కువ.

ఐపీఎల్ 2020లో ప్లేఆఫ్ చేరి మూడు, నాలుగో స్థానాల్లో నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీలకు రూ.8.75 కోట్ల చొప్పున ప్రైజ్ మనీ దక్కింది. ఇక పీఎస్ఎల్‌లో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లకు మాత్రం అసలు ప్రైజ్ మనీనే లేదు. పీఎస్ఎల్‌లో మొత్తం ప్రైజ్ మనీ రూ.7.5 కోట్లు. అంటే ఐపీఎల్‌లో నాలుగో స్థానంలో నిలిచిన జట్టు కంటే.. పీఎస్ఎల్‌లో మొత్తం ప్రైజ్ మనీ కూడా తక్కువే.

Next Story