రెండు కీలక మ్యాచుల్లో ఓడిపోయా..అర్థం కావడం లేదు: లక్ష్యసేన్
మొదటి నుంచి పతకంపై ఆశలు పెంచి చివరి అడుగులో విఫలం అయ్యాడు లక్ష్యసేన్.
By Srikanth Gundamalla Published on 6 Aug 2024 9:45 AM ISTరెండు కీలక మ్యాచుల్లో ఓడిపోయా..అర్థం కావడం లేదు: లక్ష్యసేన్
పారిస్ ఒలింపిక్స్ అట్టహాసంగా కొనసాగుతున్నాయి. భారత్‌కు చెందిన అథ్లెట్లు చివరకు వెళ్లి నిరాశ పరుస్తున్నారు. ఈ జాబితాలో లక్ష్యసేన్ కూడా ఉన్నాడు. మొదటి నుంచి పతకంపై ఆశలు పెంచి చివరి అడుగులో విఫలం అయ్యాడు. ఇక పారిస్ ఒలింపిక్స్-2024లో భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ పోరాటం ముగిసింది. పురుషుల బ్యాడ్మంటన్ సింగిల్స్ సెమీఫైనల్లో ఓటమి చవిచూసిన లక్ష్యసేన్.. కాంస్య పతక మ్యాచ్‌లో కూడా ఓటమిని చూశాడు. సోమవారం జరిగిన కాంస్య పతక పోరులో 21–13, 16–21, 11–21తో లీ జి జియా (మలేసియా) చేతిలో లక్ష్యసేన్ ఓడిపోయాడు. దాంతో.. పతకం లేకుండానే ఒలింపిక్స్ నుంచి తిరుగుపయనం అయ్యాడు.
అయితే.. కాంస్య పతక పోరులో 71 నిమిషాలపాటు మ్యాచ్ కొనసాగింది. లక్ష్య సేన్ తొలి గేమ్ గెల్చుకున్నప్పటికీ అదే జోరును తర్వాత కొనసాగించలేకపోయాడు. దాంతో.. 2008 బీజింగ్ ఒలింపిక్స్ తర్వాత బ్యాడ్మింటన్‌లో పతకం లేకుండానే భారత క్రీడాకారులు ఇంటిముఖం పట్టడం ఇదే తొలి సారి. 2012 లండన్‌లో సైనా నెహ్వాల్ కాంస్యం సాధించగా... 2016 రియోలో పీవీ సింధు రజతం, 2020 టోక్యోలో పీవీ సింధు కాంస్యం గెలిచారు. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం లక్ష్యసేన్ స్పందించి మాట్లాడాడు.
ఏం తప్పు జరిగిందో తెలియడం లేదని షట్లర్ లక్ష్యసేన్ అన్నాడు. ఏ విషయమూ చెప్పలేని స్థితిలో ఉన్నట్లు వ్యాఖ్యానించాడు. మ్యాచ్‌ను బాగా మొదలు పెట్టాననీ.. కానీ దాన్ని కొనసాగించలేకపోయానని అన్నాడు. మ్యాచ్ ఫలితంతో చాలా నిరాశ చెందానని అన్నాడు. గత మ్యాచ్, ఈ మ్యాచ్‌లను ఎలా పోల్చాలో కూడా అర్థం కావడం లేదని లక్ష్యసేన్ అన్నాడు. రెండూ కీలక మ్యాచ్‌లే.. కానీ రెండింటిలో ఓడిపోవడం బాధాకరంగా ఉందని లక్ష్యసేన్ చెప్పాడు. కీలక దశలో ఒత్తిడికి లోనయ్యానని అన్నాడు. చాలా తప్పులు చేశాననీ.. ప్రత్యర్థి రెండో గేమ్ నుంచి అద్భుతంగా పుంజుకున్నాడని అన్నాడు. అయితే.. కుడి చేతికి గాయంతో కొంత రక్తం రావడంతో మధ్యలో ఆటన ఆపేసి చికిత్స చేయించుకున్నానని చెప్పాడు. అయితే.. మ్యాచ్ ఫలితానికి దీనికి ఎలాంటి సంబంధం లేదని లక్ష్యసేన్ చెప్పుకొచ్చాడు.