తొలుత రజతమే, కానీ నవదీప్‌ సొంతమైన స్వర్ణ పతకం

పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు బాగా రాణిస్తున్నారు.

By Srikanth Gundamalla  Published on  8 Sep 2024 4:00 AM GMT
తొలుత రజతమే, కానీ నవదీప్‌ సొంతమైన స్వర్ణ పతకం

పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు బాగా రాణిస్తున్నారు. వరుసగా భారత్‌కు పతకాలు సాధించిపెడుతున్నారు. తాజాగా జావెలిన్ త్రోలో ఎఫ్‌41 విభాగంలో నవదీప్‌ సింగ్‌కు గోల్డ్‌ మెడల్ వచ్చింది. అయితే.. నవదీప్‌ స్వర్ణం సాధించడం వెనుక ఇంట్రెస్టింగ్ స్టోరీనే ఉంది. తొలుత అతను రెండో స్థానంలో నిలిచి రజతం గెలుచుకున్నాడు. కానీ.. అనూహ్యంగా గోల్డ్‌ మెడల్ గెలిచిన ఇరాన్‌కు చెందిన సదేగ్‌పై వేటు పడింది. దాంతో..రెండో స్థానంలో నిలిచిన నవదీప్‌కు గోల్డ్‌ మెడల్ దక్కింది. అసలు సదేగ్‌పై అనర్హత వేటు ఎందుకు వేశారనే దానిపై చాలా మంది ఆరా తీస్తున్నారు. దీనికి సమాధానం భారత పారా అథ్లెటిక్స్‌ హెడ్ కోచ్ సత్యనారాయణ తెలిపారు. అలాగే పారాలింపిక్స్‌ కమిటీ కూడా ఓ ప్రకటన జారీ చేసింది.

అంతర్జాతీయ పారాలింపిక్‌ కమిటీ నిబంధలను ఇరాన్‌ అథ్లెట్ అతిక్రమించాడని సత్యనారాయణ తెలిపారు. పారాలింపిక్స్‌లో అథ్లెట్లు ఎవరూ రాజకీయ, మతపరమైన నినాదాలు చేయకూడదని చెప్పారు. జాతీయ జెండాను తప్పించి మరే ఇతర పతాకాలను ప్రదర్శించకూడదన్నారు. కానీ, సదేగ్‌ మాత్రం తప్పుడు జెండాను చూపించడంతో అనర్హత వేటుకు గురి కావాల్సి వచ్చిందని పేర్కొన్నారు. దీంతో ఇరాన్‌ అప్పీలుకు వెళ్లినా పారాలింపిక్స్‌ కమిటీ తిరస్కరించిందని తెలిపారు. దాంతో.. ఫలితాలను సరిచేసి మరోసారి వెల్లడించిందన్నారు. అలా నవ్‌దీప్‌ సింగ్‌కు బంగారు పతకం ఇస్తూ కమిటీ నిర్ణయం తీసుకుందని సత్యనారాయణ తెలిపారు.

కాగా.. పారాలింపిక్స్‌లో ప్రస్తుతం భారత్‌ ఖాతాలో 29 పతకాలు చేరాయి. పట్టికలో 16వ స్థానంలో కొనసాగుతోంది. నేటితో పారాలింపిక్స్‌ ముగియనున్నాయి.

Next Story