ఒలింపిక్స్ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్‌లో ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలు అట్టహాసంగా జరిగాయి.
By Srikanth Gundamalla Published on 27 July 2024 6:00 AM GMTఒలింపిక్స్ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్‌లో ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. సెన్ నదిపై ఈ వేడుకలు కొనసాగాయి. అయితే.. ఒలింపిక్స్ వేడుకల్లో హిందీ భాషకు అరుదైన గౌరవం లభించింది. అక్కడ ప్రదర్శించిన ఆరు భాషల్లో హిందీని కూడా చేర్చారు. ‘సిస్టర్ హుడ్’ పేరిట ఫ్రాన్స్ మహిళలు అందించిన తోడ్పాటుకు నివాళిగా కొన్ని ఇన్ఫోగ్రాఫిక్స్‌ను ప్రదర్శించారు. మహిళల హక్కులను కాపాడేందుకు కట్టుబడి ఉన్నామని తమ నిబద్ధతను చాటుకున్నారు. అయితే.. ఈ దృశ్యాలు ఆన్‌లై్‌లో వైరల్‌గా మారాయి. ఫ్రాన్స్‌తో ఉన్న బలమైన దౌత్య సంబంధాలను ఇది తెలియజేస్తుందని ఓ నెటిజన్ ఈ ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. పలువురు ఈ పోస్టుపై హర్షం వ్యక్తం చేశారు. ఇది భారత్‌కే గర్వకారణమంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు.
అయితే.. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ప్రారంభ వేడుకలు జరిగాయి. నీటిపై జరిగిన 6 కిలోమీటర్ల పరేడ్‌లో 85 పడవలపై 6,800 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. ఈ సంబరాలను వీక్షించేందుకు 3లక్షల 20వేల మంది ప్రేక్షకులు హాజరయ్యారని పేర్కొన్నారు. చిన్న పడవలో ముగ్గురు పిల్లలు, ఓ ముసుగు వ్యక్తి ఒలింపిక్ జ్యోతి పట్టుకొని రావడంతో ఈ కార్యక్రమం మొదలైంది. ఫ్రెంచ్ అక్షర క్రమంలో 84వ దేశంగా భారత్ వచ్చింది. బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, టేబుల్ టెన్నిస్ దిగ్గజం శరత్ కమల్ పతాకధారులుగా వ్యవహరించారు. ఈ ఇద్దరూ త్రివర్ణ పతాకాన్ని పట్టుకొని ముందు నిలబడగా.. వెనకాల భారత్‌కు చెందిన అథ్లెట్లతో పడవ ముందుకు సాగింది.