ODI World Cup: ఇసుక దిబ్బనా..? ధర్మశాల గ్రౌండ్‌పై నెటిజన్ల కామెంట్స్

ధర్మశాల మైదానంపై నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

By Srikanth Gundamalla  Published on  8 Oct 2023 11:49 AM IST
ODI World Cup-2023, AFG Vs BAN, Dharamsala Ground,

ODI World Cup: ఇసుక దిబ్బనా..? ధర్మశాల గ్రౌండ్‌పై నెటిజన్ల కామెంట్స్

భారత్‌ వేదికగా వన్డే వరల్డ్ కప్‌-2023 టోర్నీ అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ టోర్నీని విజయవంతం చేసేందుకు బీసీసీఐ అన్నిరకాలుగా ఏర్పాట్లు చేస్తోంది. అయితే..అక్టోబర్ 7వ తేదీన ధర్మశాల వేదికగా అక్టోబర్‌ 7న అప్ఘాన్‌-బంగ్లాదేశ్‌ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్‌ చేసిన అప్ఘానిస్థాన్‌ 37.2 ఓవర్లలో 156 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ 34.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేదించింది. విజయాన్ని అందుకుంది. హసన్ మీరజ్‌ ఆల్‌రౌండర్‌ షోతో బంగ్లాదేశ్‌ గెలుపులో కీలక పాత్ర పోషించాడు.

అయితే.. ఈ మ్యాచ్‌ తర్వాత ధర్మశాల మైదానంపై నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. బౌండరీ లైన్‌ వద్ద గ్రౌండ్‌ పరిస్థితికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దాన్ని చూసిన నెటిజన్లు ధర్మశాల వేదికపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. అప్ఘానిస్తాన్‌ ఆటగాడు ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌ ఫీల్డింగ్‌ చేస్తూ బౌండరీ వద్ద ఫోర్‌ను ఆపేందుకు డైవ్‌ వేశాడు. అయితే.. అప్పుడు ఇసుక, మట్టి దిబ్బలా మొత్తం లేచి వచ్చింది. దాంతో.. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఈ గ్రౌండ్‌ కంటే ఇసుక, బురద దిబ్బలు నయమని కామెంట్స్ పెడుతున్నారు. గ్రౌండ్‌ పరిస్థితి చెత్తగా ఉందంటూ విమర్శలు చేస్తున్నారు. అంతేకాదు.. వరల్డ్‌ కప్‌ లాంటి మెగా ఈవెంట్‌ మ్యాచ్‌ నిర్వహించేందుకు ఇలాంటి పరిస్థితులు ఉన్న గ్రౌండ్‌కు ఐసీసీ ఎలా అనుమతిచ్చింది అంటూ ప్రశ్నిస్తున్నారు. కనీస ప్రమాణాలు పాటించలేదని.. బురద మైదానంలో మ్యాచ్‌ నిర్వహించడాన్ని తప్పుబడుతున్నారు. కొందరు అయితే.. బీసీసీఐని నిందిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

కాగా.. ధర్మశాల మైదానం హిమాచల్‌ ప్రదేశ్‌లోని ఎత్తైన కొండ ప్రాంతంలో ఉంటుంది. దాంతో.. ఇక్కడ వాతావరణం ఎప్పుడూ శీతలంగానే ఉంటుంది. ఎండ రావడం చాలా అరుదుగా జరుగుతుంది. అయితే.. ధర్మశాల గ్రౌండ్‌ చాలా గొప్పది అని కొందరు కామెంట్స్‌ పెడుతున్నారు. ఈ మైదానాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమమైనది అని ఐసీసీ ప్రకటించిందని చెబుతున్నారు. ఇక్కడ గతంలోనూ పెద్ద ఈవెంట్‌లు చాలా నిర్వహించారని.. కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని కామెంట్స్ పెట్టారు. అదీకాక రెండ్రోజుల క్రితం ధర్మశాలలో భారీ వర్షం కురిసిందని.. అందుకే పరిస్తితి ఇలా ఉందని చెప్పుకొచ్చారు.

Next Story