వరల్డ్ కప్ ట్రోఫీపై కాళ్లు పెట్టి, బీర్ తాగిన మిచెల్.. అభిమానుల ఆగ్రహం
వన్డే వరల్డ్ కప్‌లో మరోసారి ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. ఇప్పటి వరకు ఆరోసారి కప్‌ను సొంతం చేసుకుంది.
By Srikanth Gundamalla
వరల్డ్ కప్ ట్రోఫీపై కాళ్లు పెట్టి, బీర్ తాగిన మిచెల్.. అభిమానుల ఆగ్రహం
వన్డే వరల్డ్ కప్‌లో మరోసారి ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. ఇప్పటి వరకు ఆరోసారి కప్‌ను సొంతం చేసుకుంది. టీమిండియా హాట్ ఫేవరెట్‌గా ఉన్నా కూడా.. ఆస్ట్రేలియా రాణించిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. ఫీల్డింగ్.. బౌలింగ్.. బ్యాటింగ్‌లోనూ రాణించి విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 240 పరుగులు చేయగా.. ఆస్ట్రేలియా ఆ టార్గెట్‌ను 4 వికెట్లు కోల్పోయి చేధించింది.
వరల్డ్ కప్ సాధించిన తర్వాత రికార్డు నెలకొల్పిన ఆస్ట్రేలియా సంబరాలు అంబరాన్నంటేలా చేసుకుంది. ఆటగాళ్లు అందరూ ఒకరినొకరు హత్తుకుంటూ.. శుభాకాంక్షలు చెప్పుకున్నారు. అయితే.. కప్ గెలిచాక అవార్డులు అందుకున్నంత వరకు బాగానే ఉంది. కానీ.. డ్రెస్సింగ్ రూమ్‌లో ఆసీస్ ఆటగాళ్లు వ్యవహరించిన తీరే క్రికెట్ అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. కప్ సొంతం చేసుకున్న సందర్భంగా డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్లు ఆనందంగా బీర్‌లు తాగారు. అయితే.. అంతటితో ఆగకుండా ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ మార్స్ వరల్డ్ కప్ ట్రోఫీపై కాళ్లు పెట్టి.. ఒకే చేతిలో బీర్ పట్టుకుని కుర్చీలో కూర్చుని ఉన్నాడు. ఈ ఫొటో బయటకు రావడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు మిచెల్ మార్ష్ తీరుపై మండిపడుతున్నారు. సరదాగా చేసినా.. ఎలా చేసినా ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదంటున్నారు. ఈ ట్రోఫీ కోసం వివిధ దేశాలకు చెందిన టీమ్‌లు ఎంతగానో కష్టపడి పోరాటం చేశాయని.. అలాంటిది కొంచెం కూడా గౌరవం లేకుండా కాళ్లు పెట్టి బీరు సేవించడం సరికాదంటూ చివాట్లు పెడుతున్నారు. ఇది ప్రపంచ కప్‌ను అవమానించడమే అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
ఈ సమయంలోనే 2011లో టీమిండియా వరల్డ్ కప్‌ను గెలిచిన సందర్భంగా సచిన్, ఎంఎస్ ధోనీకి సంబంధించిన ఫొటోలను కూడా షేర్ చేస్తున్నారు. వరల్డ్ కప్ ట్రోఫీని రెండు చేతుల్లోకి తీసుకుని అత్యంత ప్రతిష్టాత్మకంగా ఫీలవుతూ ముద్దుపెడుతున్న ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. టీమిండియా ఇలా ఉంటే.. ఆస్ట్రేలియా క్రికెటర్లు ఇలా అమర్యాదగా ప్రవర్తించారంటూ పోల్చి చెబుతున్నారు. అయితే.. ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఇలా వ్యవహరించడం ఇదే తొలిసారి కాదు. 2006లో భారత్ వేదికగా జరిగిన చాంపియన్స్ ట్రోఫీలోనూ ఇలాగే చేశారు. అప్పుడు బీసీసీఐ ప్రెసిడెంట్‌గా ఉన్న శరద్ పవార్ ఆసీస్‌కు విన్నింగ్ ట్రోఫీని అందించారు. అప్పటి ఆసీస్ కెప్టెన్ రికీ పాంటింగ్ స్టేజ్ దిగిపోవాలని శరద్ పవార్‌ను నెట్టేసిన ఘటనను గుర్తు చేసుకుంటున్నారు నెటిజన్లు.
Mitchell Marsh with the World Cup. pic.twitter.com/n2oViCDgna
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 20, 2023