భారత షూటర్ మను బాకర్‌కు అరుదైన గౌరవం
పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత యువ షూటర్ మను బాకర్ పేరు మార్మోగింది
By Srikanth Gundamalla
భారత షూటర్ మను బాకర్‌కు అరుదైన గౌరవం
పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత యువ షూటర్ మను బాకర్ పేరు మార్మోగింది. ఆమె ఏకంగా రెండు పతకాలను గెలుచుకుంది. దేశం ప్రఖ్యాతిని పెంచిన మను బాకర్‌కు తాజాగా అరుదైన గౌరవం లభించింది. పోటీల ముగింపు వేడుకల్లో మను బాకర్ మహిళా పతాకధారిగా వ్యవహించనున్నారు. ఈ మేరకు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రకటన విడుదల చేసింది.
పారిస్‌లో ఒలిపింక్స్ కొనసాగుతోంది. ఈ పోటీలు ఆగస్టు 11న ముగింపు వేడుకలు జరగనున్నాయి. ఇప్పటి వరకు భారత్ మూడు కాంస్యాలను మాత్రమే సాధించింది. ఇందులో రెండు మను బాకర్‌వే కావడం గమనార్హం. మరో షూటర్ సరబ్‌జోత్ సింగ్ కాంస్యం గెలిచాడు. ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన మను బాకర్ అరుదైన ఘనతను సాధించింది. 1900 ఒలింపిక్స్‌లో నార్మన్ ప్రిచర్డ్ రెండు పతకాలు గెలవగా.. ఆ తర్వాత రెండు పతకాలను గెలిచిన ఏకైక అథ్లెట్ మను బాకరే. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో, సరబ్ జ్యోత్ సింగ్‌తో కలిసి 10మీ ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో కాంస్యాలు గెలుచుకున్న సంగతి తెలిసిందే. 25 మీటర్ల పిస్టల్ విభాగంలో నాలుగో స్థానంలో నిలిచి తృటిలో మరో కాంస్య పతకాన్ని కోల్పోయారు. లేకపోతే మూడు పతకాలు సాధించిన ఏకైక భారత్ క్రీడాకారిణిగా అవతరించేది. కానీ.. ఆమె మూడో పతకాన్ని తృటిలో మిస్ చేసుకుంది.