Video : సరైనోడినే తీసుకున్న ఆర్సీబీ.. వేలం మ‌రుస‌టి రోజే విధ్వంసం..!

అబుదాబి టీ10 లీగ్‌లో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్ 15 బంతుల్లో అజేయంగా 50 పరుగులు చేశాడు.

By Kalasani Durgapraveen  Published on  26 Nov 2024 8:30 PM IST
Video : సరైనోడినే తీసుకున్న ఆర్సీబీ.. వేలం మ‌రుస‌టి రోజే విధ్వంసం..!

అబుదాబి టీ10 లీగ్‌లో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్ 15 బంతుల్లో అజేయంగా 50 పరుగులు చేశాడు. IPL 2025 మెగా వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అతనిని రూ. 8.75 కోట్లకు సంతకం చేసిన ఒక రోజు తర్వాత ఈ ఇన్నింగ్స్ ఆడాడు. లివింగ్‌స్టోన్ రెచ్చిపోవ‌డంతో ఢిల్లీ బుల్స్‌పై బంగ్లా టైగర్స్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అత‌డి ఇన్నింగ్సులో మూడు ఫోర్లు, ఐదు సిక్సర్లు బాదాడు. ఈ విధ్వంస‌క‌ర‌ బ్యాట్స్‌మెన్ దాటికి 123 పరుగుల లక్ష్యాన్ని టైగర్స్ మరో రెండు బంతులు మిగిలి ఉండగానే సులువుగా అందుకుంది.

ఇంగ్లండ్‌ మాజీ బ్యాట్స్‌మెన్‌ జేమ్స్‌ విన్స్‌ 15 బంతుల్లో 27 పరుగులు చేసి బుల్స్‌ తరఫున అత్యధిక స్కోరు సాధించాడు. జట్టు స్కోరు 65/2 ఉన్నప్పుడు లివింగ్‌స్టోన్ బ్యాటింగ్‌కు వచ్చాడు. లివింగ్‌స్టోన్ 162.45 స్ట్రైక్ రేట్‌తో 939 పరుగులు చేసి ఐపీఎల్‌లో కూడా తన సత్తా చాటాడు. ఐపీఎల్‌లో ఆరు అర్ధసెంచరీలు చేసిన లివింగ్‌స్టోన్ ఇప్పటివరకు రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ తరఫున ఆడాడు.

లివింగ్‌స్టోన్ బిగ్ బాష్, SA20, IPL వంటి లీగ్‌లలో ఆడే T20 స్పెషలిస్ట్. ఐపీఎల్ 2022లో అతడిని రూ.11.50 కోట్ల భారీ మొత్తానికి పీబీకేఎస్ కొనుగోలు చేసింది. అతడు గత సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున 182.08 స్ట్రైక్ రేట్‌తో 437 పరుగులు చేశాడు. అయినప్పటికీ పంజాబ్ కింగ్స్ అతనిని తీసుకోలేదు.

Next Story