కరోనా వైరస్ ఎవ్వరిని వదలడం లేదు. పేద, ధనిక అన్న తేడా లేకుండా అందరూ ఈ మహమ్మారి భారిన పడుతున్నారు. ఈ మహమ్మారి కారణంగా చాలా క్రీడలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు క్రీడాకారులు ఈ మహమ్మారి బారిన పడి కోలుకున్నారు. తాజాగా ఫార్ములా వన్ వరల్డ్ ఛాంపియన్ లూయిస్ హామిల్టన్ కరోనా బారిన పడ్డాడు.
సోమవారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా వచ్చింది. దీంతో.. ఏడుసార్లు ఎఫ్ 1 చాంపియన్‌గా నిలిచి చరిత్ర సృష్టించిన హామిల్టన్.. సాఖిర్ గ్రాండ్ ప్రికి దూరమవుతున్నట్లు మెర్సెడీజ్-ఏఎంజీ పెట్రొనాస్ ఎఫ్1 టీమ్ తెలిపింది. గత వారంలో మూడుసార్లు పరీక్షలు నిర్వహించినా.. ప్రతిసారీ నెగటివ్ రిపోర్ట్ వచ్చినట్లు టీమ్ చెప్పింది. ఆదివారం బహ్రెయిన్ గ్రాండ్ ప్రి కూడా గెలిచాడు. అయితే సోమవారం ఉదయమే అతనికి కరోనా లక్షణాలు కనిపించాయని టీమ్ తెలిపింది. ఆ తర్వాత టెస్ట్ చేస్తే కొవిడ్ పాజిటివ్‌గా తేలినట్లు వెల్లడించింది. ప్రస్తుతం బహ్రెయిన్‌లో ఉన్న హామిల్టన్.. అక్కడి నిబంధనల మేరకు ఐసోలేషన్‌లో ఉన్నాడు. స్వల్ప లక్షణాలు మినహాయించి.. అతడు ఫిట్‌గా ఉన్నట్లు టీమ్ ఆ ప్రకటనలో తెలిపింది.