పంత్‌కు షాకిచ్చిన సాహా..

IPL -2020 .. ధోని వార‌సుడిగా ఎంట్రీ ఇచ్చి.. త‌రువాత పేల‌వ షాట్ల‌తో ప‌రిమిత ఓవ‌ర్ల క్రికెట్‌లో జ‌ట్టులో స్థానం కోల్పోయాడు

By సుభాష్  Published on  19 Nov 2020 6:23 AM GMT
పంత్‌కు షాకిచ్చిన సాహా..

ధోని వార‌సుడిగా ఎంట్రీ ఇచ్చి.. త‌రువాత పేల‌వ షాట్ల‌తో ప‌రిమిత ఓవ‌ర్ల క్రికెట్‌లో జ‌ట్టులో స్థానం కోల్పోయాడు యంగ్ వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్‌. కాగా.. సుదీర్ఘ పార్మాట్‌లో మంచి రికార్డు ఉండ‌డంతో టెస్టు క్రికెట్ జ‌ట్టులో చోటు ద‌క్కుతున్నా.. తుది జ‌ట్టులో ఆడే అవ‌కాశం మాత్రం ల‌భించ‌డం లేదు. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్‌)లో వృద్దిమాన్ సాహా గాయ‌ప‌డ‌డంతో.. ఈ సారి ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లో టెస్టు మ్యాచ్‌లో పంత్ బ‌రిలోకి దిగుతాడ‌ని బావించారు.

అయితే.. వృద్దిమాన్ సాహా ఫిట్‌నెస్ సాధించ‌డంతో.. రెండో వికెట్ కీప‌ర్‌గా ఎంపికైన రిష‌బ్ పంత్‌కు షాక్ త‌గ‌ల‌నుంది. ఈ సిరీస్‌లో అతడు రిజర్వ్ బెంచ్‌కే పరిమితం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఐపీఎల్ 2020 సీజన్‌లో 14 మ్యాచ్‌లాడిన పంత్ 113.95 స్ట్రైక్‌రేట్‌తో 343 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒక హాఫ్ సెంచరీ మాత్రమే ఉంది. ఆహా అనిపించే ఒక్క ఇన్నింగ్స్ ఆడలేదు. తనకు అలవాటైన షాట్‌తో వికెట్ చేజార్చుకుని పెద్ద ఎత్తున విమర్శల పాలయ్యాడు. కీలక ఆసీస్ పర్యటన నేపథ్యంలో తుది జట్టులో పంత్‌ను ఆడించే సాహసం విరాట్ కోహ్లీ చేయకపోవచ్చు.

ఐపీఎల్ 2020 సీజన్‌‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఓపెనర్‌గా ఆడిన వృద్ధిమాన్ సాహా రెండు మ్యాచ్‌ల్లో హాఫ్ సెంచరీలు బాది ఆ జట్టుని గెలిపించాడు. ఐపీఎల్ 13వ సీజన్‌లో 4 మ్యాచ్‌లాడిన సాహా 139.86 స్ట్రైక్‌రేట్‌తో 214 పరుగులు చేశాడు. తొడ కండరాల గాయంతో ఎలిమినేటర్, క్వాలిఫయర్-2 మ్యాచ్‌కి అతడు దూరంగా ఉన్నాడు. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న సాహా ఎట్టకేలకి ఫిట్‌నెస్ సాధించాడు. సిడ్నీ ఒలింపిక్‌ పార్క్‌ మైదానంలో బుధవారం సాహా నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ మొదలెట్టాడు. భారత సహాయక సిబ్బంది త్రో బంతులు విసరగా.. చక్కగా బ్యాటింగ్ చేశాడు. సాహా బ్యాటింగ్ ప్రాక్టీస్‌కు సంబందించిన వీడియోను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. 'ఈ రోజు నెట్స్‌లో ఎవరు బ్యాటింగ్ చేస్తున్నారో చూడండి' అని బీసీసీఐ కాప్షన్ పెట్టింది. నవంబర్‌ 27 నుంచి ఆరంభమయ్యే ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనుంది.

Next Story