శ్రీలంకతో భారత్ తొలి వన్డే టై.. సూపర్ ఓవర్ ఎందుకు లేదంటే..
కొలంబో వేదికగా శుక్రవారం భారత్, శ్రీలంక క్రికెట్ జట్లు వన్డే సిరీస్‌ను మొదలుపెట్టాయి.
By Srikanth Gundamalla Published on 3 Aug 2024 7:17 AM IST
శ్రీలంకతో భారత్ తొలి వన్డే టై.. సూపర్ ఓవర్ ఎందుకు లేదంటే..
కొలంబో వేదికగా శుక్రవారం భారత్, శ్రీలంక క్రికెట్ జట్లు వన్డే సిరీస్‌ను మొదలుపెట్టాయి. ఇందులో భాగంగా మొదటి వన్డే మ్యాచ్ టైగా ముగిసింది. చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగింది ఈ మ్యాచ్. మందకొడి పిచ్‌పై తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 8 వికెట్లు కోల్పోయి 230 పరుగులు చేసింది. ధునిత్ వెల్లలాగే (66 నాటౌట్, 65 బంతుల్లో), నిస్సాంక (56 పరుగులు, 75 బంతుల్లో) అర్ధశతకాలతో రాణించారు. ఇక భారత బౌలర్లలో అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్ తలో రెండు వికెట్లు తీశారు.
ఆ తర్వాత 231 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 47.5 ఓవర్లలో సరిగ్గా 230 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. రోహిత్ శర్ (58 పరుగులు 47 బంతుల్లో) టాప్ స్కోరర్ గా నిలిచాడు. అక్షర్ పటేల్ (33 పరుగులు, 57 బంతుల్లో), కేఎల్ రాహుల్ (31 పరుగులు 43 బంతుల్లో), విరాట్ కోహ్లి (24 పరుగులు 32 బంతుల్లో), శ్రేయస్ అయ్యర్ (23 పరుగులు 23 బంతుల్లో) చేశారు. ఇక శ్రీలంక బౌలర్లలో హసరంగ, అసలంక చెరో మూడు వికెట్లు తీశారు. వెల్లలాగే రెండు వికెట్లతో సత్తాచాటారు. అయితే.. భారత్‌కు లక్ష్య చేదనలో ముందుగా మంచి ఆరంభం లభించింది. కానీ.. రోహిత్, గిల్ ఔట్ అయిన తర్వాత వికెట్ల పతనం మొదలైంది. కోహ్లి-శ్రేయస్, కేఎల్ రాహుల్- అక్షర్ పటేల్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడానికి ప్రయత్నించినా.. స్కోరు బోర్డు పెద్దగా ముందుకు కదల్లేదు. చివరకు 230 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. మ్యాచ్ టైగా ముగిసింది.
అయితే.. ఈ మ్యాచ్ టైగా ముగిస్తే.. సూపర్ ఓవర్ ఎందుకు పెట్టలేదనే ప్రశ్న చాలా మందిని వెంటాడుతోంది. ఇటీవల ముగిసిన మూడో టీ20 కూడా టైగానే మారింది. ఫలితం తేలడం కోసం సూపర్ ఓవర్ నిర్వహించగా భారత్ గెలిచింది. కానీ ఇవాళ వన్డేకు సూపర్ ఓవర్ నిర్వహించలేదు. ఎందుకంటే ఐసీసీ వన్డే రూల్స్ ప్రకారం ద్వైపాక్షిక సిరీస్‌ల్లో ఓ మ్యాచ్‌లో విజేతను తేల్చడానికి సూపర్ ఓవర్ నిర్వహించరు. ఐసీసీ టోర్నమెంట్స్, ఆసియా కప్, ముక్కోణపు సిరీస్ వన్డే ఫార్మాట్‌లో జరిగితే మాత్రం సూపర్ ఓవర్లను నిర్వహిస్తారు. ఆ కారణంతో తొలి వన్డేకు సూపర్ ఓవర్ జరగలేదు.