IND Vs ENG: ధర్మశాల టెస్టులో తొలిరోజు భారత్‌దే ఆధిపత్యం
భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదో టెస్టు మ్యాచ్ ధర్మశాల వేదికగా జరుగుతోంది.
By Srikanth Gundamalla Published on 7 March 2024 5:29 PM IST
IND Vs ENG: ధర్మశాల టెస్టులో తొలిరోజు భారత్‌దే ఆధిపత్యం
భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదో టెస్టు మ్యాచ్ ధర్మశాల వేదికగా జరుగుతోంది. ఇప్పటికే ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను భారత్ 3-1తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. చివరి టెస్టు మ్యాచ్‌లో గెలిచి విజయంతో ముగించాలని భావిస్తోంది. అయితే.. ఐదో టెస్టులో తొలిరోజు టీమిండియానే ఆధిపత్యం కొనసాగించింది. ఇటు బౌలింగ్‌లో రాణించడంతో తొలిరోజే ఇంగ్లండ్ ఆలౌట్ అయ్యింది. చలిగా ఉండే ధర్మశాల స్టేడియంలో కూడా ప్రత్యర్థి ఆటగాళ్లకు ముచ్చెమటలు పట్టించారు స్పిన్నర్లు. కుల్దీప్ 72 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీయగా.. అశ్విన్ 51 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. ఇక మిగిలిన ఒక్క వికెట్ జడేజా ఖాతాఓల పడింది. దాంతో.. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 218 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఓపెనర్ జాక్‌క్రాలే 79 పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లంతా పెద్దగా రాణించలేకపోయారు.
ఇక మధ్యాహ్నం తర్వాత తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ నిలకడగా ఆడింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ చెరో హాఫ్ సెంచరీ చేశారు. యశస్వి జైస్వాల్ 58 బంతుల్లో 57 పరుగులు చేశాడు. మెరుపు ఇన్నింగ్స్‌తో మరోసారి అదరగొట్టాడు. రోహిత్ శర్మ 83 బంతుల్లో 52 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇక మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన శుభ్‌మన్ గిల్ కూడా నిలకడగా కనిపిస్తున్నాడు. 39 బంతుల్లో 26 పరుగులు చేశాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 135/1 స్కోరుతో నిలిచింది. ప్రస్తుతం క్రీజులో రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఉన్నారు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 83 పరుగుల ట్రయల్‌లో ఉంది.
తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన కాసేపటికే భారత ఓపెనర్లు టీ20 ఆటను తలపించేలా బ్యాటింగ్ చేశారు. రోహిత్, యశస్వి జైస్వాల్ పోటాపోటీగా బౌండరీలు చేశారు. దాంతో.. స్కోరు బోర్డు పరుగులు తీసింది. తొలి వికెట్ కోల్పోవడానికి ముందు 104 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు రోహిత్, జైస్వాల్. ఇక జైస్వాల్ ఔట్ అయిన తర్వాత వచ్చిన గిల్ కూడా నిలకడగా ఆడుతున్నాడు. మొత్తానికి ఇటు బౌలింగ్.. అటు బ్యాటింగ్ తొలిరోజు ఇంగ్లండ్‌పై భారత్ ఆధిపత్యం కొనసాగించింది.