రాంచీ టెస్టుకు బుమ్రా దూరం..? కేఎల్‌ రాహుల్ వచ్చేస్తాడా?

భారత్‌ వేదికగా ప్రస్తుతం టీమిండియా ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ ఆడుతోంది.

By Srikanth Gundamalla  Published on  19 Feb 2024 2:30 PM IST
india vs england, 4th test match, bumrah, kl rahul,

రాంచీ టెస్టుకు బుమ్రా దూరం..? కేఎల్‌ రాహుల్ వచ్చేస్తాడా?

భారత్‌ వేదికగా ప్రస్తుతం టీమిండియా ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ ఆడుతోంది. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌ ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇప్పటి వరకు మూడు టెస్టు ఆడగా 2-1తో ఇండియా పైచేయి సాధించింది. ఇక నాలుగో టెస్టు ఇంగ్లండ్‌కు కీలకం అవుతోంది. రాంచీ వేదికగా జరిగే ఈ టెస్టు మ్యాచ్‌ కోసం టీమిండియాలో స్వల్ప మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇప్పటి వరకు విరామం లేకుండా వరుసగా మూడు టెస్టులు ఆడిన స్టార్ పేసర్‌ బుమ్రాకు రెస్ట్‌ ఇచ్చే యోచనలో ఉంది బీసీసీఐ. ఇంగ్లండ్‌తో రాంచీ వేదికగా శుక్రవారం నుంచి నాలుగో టెస్టు ప్రారంభం కానుంది. బుమ్రాపై పనిభారం తగ్గించేందుకు జట్టు మేనేజ్‌మెంట్‌ ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అయితే.. బుమ్రాకు నాలుగో టెస్టుకు విశ్రాంతి ఇచ్చి.. ఆతర్వాత ఐదో టెస్టు మ్యాచ్‌లో ఆడించాలని బీసీసీఐ ఆలోచిస్తుంది. ఒకవేళ రాంచీ టెస్టులో ఇండియా గెలిస్తే టెస్టు సిరీస్‌ను భారత జట్టు గెలిచినట్లు అవుతుంది. అలా జరిగితే బుమ్రా ఐదు టెస్టు మ్యాచ్‌లో కూడా ఆడకపోవచ్చు. కాగా.. జస్ప్రీత్‌ బుమ్రా ఈ మూడె టెస్టుల్లో దాదాపు 81 ఓవర్లు వేశాడు. మొత్తం 17 వికెట్లు తీసి.. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.

అయితే.. నాలుగో టెస్టులో బుమ్రా స్థానంలో ముకేశ్‌ కుమార్‌ను కానీ.. పిచ్‌ అనుకూలతను బట్టి నాలుగో స్పిన్నర్‌ను జట్టులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. రంజీ ట్రోఫీ కోసం ముకేశ్‌ కుమార్‌ను జట్టు నుంచి రిలీజ్‌ చేసిన విషయం తెలిసిందే. బెంగాల్‌కు ప్రాతినథ్యం వహించిన ముకేశ్‌ కుమార్‌ బీహార్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 10 వికెట్లు తీసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు పడగొట్టాడు.

మరోవైపు ఫిట్‌నెస్ కారణంగా మూడో టెస్టుకు దూరమైన కేఎస్‌ రాహుల్‌కు.. బీసీసీఐ వైద్యబృందం గ్రీన్‌ సిగ్నల్ ఇస్తే నాలుగో టెస్టు మ్యాచ్‌కు అందుబాటులోకి వస్తాడు. రాహుల్‌ టీమ్‌లోకి వస్తే.. గత రెండు టెస్టు మ్యాచుల్లో విఫలైమన రజత్‌ పటిదార్‌ను పక్కకు పెట్టే అవకాశాలు ఉన్నాయి. రెండు టెస్టుల్లో కలిపి రజత్ పటిదార్‌ మొత్తం 46 పరుగులు మాత్రమే చేశాడు.

Next Story