ఆసీస్‌తో నాలుగో టీ-20 మ్యాచ్‌లో టీమిండియాలో కీలక మార్పులు
ఆస్ట్రేలియాతో టీమిండియా ఐదు టీ20ల సిరీస్ ఆడుతోంది.
By Srikanth Gundamalla Published on 30 Nov 2023 11:54 AM IST
ఆసీస్‌తో నాలుగో టీ-20 మ్యాచ్‌లో టీమిండియాలో కీలక మార్పులు
ఆస్ట్రేలియాతో టీమిండియా ఐదు టీ20ల సిరీస్ ఆడుతోంది. భారత్ వేదికగా జరుగుతోన్న ఈ సిరీస్‌లో 2-1తో టీమిండియా ఆధిక్యంలో ఉంది. అయితే.. రాయ్‌పూర్ వేదికగా నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈమ్యాచ్‌లో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని భారత్ ప్రయత్నిస్తోంది. మూడో టీ20 మ్యాచ్‌లో భారీ స్కోరును చేసినా కూడా.. దాన్నికాపాడుకోలేక పోయింది. గ్లెన్‌మ్యాక్స్‌వెల్ సెంచరీతో చెలరేగడంతో ఓటమని చూసింది. దాంతో.. నాలుగో మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని టీమిండియా పట్టుదలతో ఉంది. మరోవైపు ఆసీస్ మూడో టీ20 విజయాన్ని కొనసాగించాలని.. తద్వారా సిరీస్ గెలవాలని బావిస్తోంది.
కాగా.. నాలుగో టీ20 మ్యాచ్‌కు ముందు భారత జట్టులో మార్పులు జరగనున్నాయి. ఆఖరి రెండు టీ20లకు శ్రేయస్ అయ్యర్ జట్టులోకి వస్తుండటమే అందుకు కారణం. వన్డే వరల్డ్ కప్ ఆడిన శ్రేయస్ అయ్యర్‌కు టీమ్ మేనేజ్‌మెంట్ మొదటి మూడు టీ20లకు రెస్ట్ ఇచ్చింది. ఆఖరి రెండు టీ20ల్లో మాత్రం ఆడించాలని అనుకుంది. అంతేకాదు.. ఈ రెండు టీ20లకు శ్రేయాస్‌ను వైస్ కెప్టెన్‌గా కూడా నియమించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం టీమ్‌నుంచి ఎవరిని పక్కకు పెట్టాలనే ఆలోచన కెప్టెన్ సూర్యకుమార్ కు తలనొప్పిగా మారింది. శ్రేయస్ అయ్యర్ ఎంట్రీతో తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు చోటు దక్కడం కష్టమే అంటున్నారు. ఒకవేళ తిలక్, శ్రేయాస్ ఇద్దరిలో ఒకరిని ఎంచుకోవాలంటే సూర్యకుమార్ శ్రేయాస్‌ను ఎంచుకునే అవకాశాలు ఉన్నాయి.
మూడో టీ20లో భారత బౌలర్లు విఫలమయ్యారు. భారీ స్కోరు ఉన్నా కూడా దాన్ని కాపాడుకోలేకపోయారు. పెళ్లి కారణంగా మూడో టీ20కి దూరంగా ఉన్న ముఖేష్ కుమార్ నాలుగో టీ20కి తిరిగి అందుబాటులోకి వచ్చాడు. ముఖేష్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నాడు.. దాంతో అతనికి ఛాన్స్ దొరకొచ్చు. అలాగే దీపక్ చాహర్ సైతం ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న ప్రసిధ్ కృష్ణ, ఆవేశ్ ఖాన్‌ను బెంచ్‌కే పరిమితం చేసే అవకాశాలు ఉన్నాయి.