సిరీస్ పై భారత్ కన్ను.. మూడో టీ20కి వర్షం ముప్పు ఉందా..?
వరల్డ్ కప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో భారత్ ఓటమి తర్వాత.. అదే టీమ్‌తో భారత్ వేదికగా టీమిండియా టీ20 సిరీస్ ఆడుతోంది.
By Srikanth Gundamalla Published on 28 Nov 2023 9:45 AM IST
సిరీస్ కప్పుపై భారత్ కన్ను.. మూడో టీ20కి వర్షం ముప్పు ఉందా..?
వరల్డ్ కప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో భారత్ ఓటమి తర్వాత.. అదే టీమ్‌తో భారత్ వేదికగా టీమిండియా టీ20 సిరీస్ ఆడుతోంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇవాళ మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు గెలిచిన భారత్ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇవాళ్టి మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భావిస్తోంది. మరోవైపు ఈ మ్యాచ్‌లో గెలిచి ఎలాగైనా సిరీస్‌పై ఆశలు నిలబెట్టుకోవాలని ఆస్ట్రేలియా భావిస్తోంది. దాంతో.. ఇవాళ జరగనున్న మూడో టీ20 మ్యాచ్ కీలకంగా మారుతుంది. గౌహతిలోని బర్సపరా స్టేడియం వేదికగా ఈ కీలక పోరు జరగనుంది.
కీలక మ్యాచ్ నేపథ్యంలో గౌహతిలో వాతావరణ శాఖ ప్రకటన కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం అక్కడ వర్షం కురిసే అవకాశం లేదని వాతావరణశాఖ పేర్కొంది. 20 శాతం పాక్షిక మేఘావృతం అవుతుందని.. అయితే వర్షం పడే అవకాశం మాత్రం లేదని తెలిపింది. 19-21 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత మధ్య ఈ మ్యాచ్ జరుగుతుందని చెప్పింది. తేమ ఎక్కువగా ఉంటుందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. అంతేకాదు.. గంటకు 11 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తామని కూడా వెల్లడించింది. మొత్తంగా మ్యాచ్ జరగడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని వాతావరణశాఖ వెల్లడించింది.
వరల్డ్ కప్‌లో నిరాశ తర్వాత ఈ టీ20 సిరీస్‌లో యువఆటగాళ్లు ఆడుతున్నారు. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో యంగ్ ప్లేయర్స్ దూసుకెళ్తున్నారు. బ్యాటింగ్.. ఫీల్డింగ్.. బౌలింగ్‌లో కూడా రాణిస్తున్నారు. రెండో మ్యాచ్‌లో అయితే ఏకంగా 235 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ మెరుపు శాట్స్ ఆడుతూ హాఫ్ సెంచరీ చేశాడు. మరోవైపు రుతురాజ్, ఇషాన్ కిషన్ కూడా అర్థశతకాలు సాధించారు. చివరలో వస్తున్న రింకూ సింగ్ అయితే ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. బెస్ట్ ఫినిషర్ అనే పేరు సంపాదించుకుంటున్నాడు. కేవలం 9 బంతుల్లో 31 పరుగులు చేశాడు.
మరోవైపు మొదటి రెండు మ్యాచుల్లో కూడా ఆసీస్ ఆటగాళ్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. వరల్డ్ కప్ ఫైనల్‌లో సెంచరీతో తమ టీంను గెలిపించిన ట్రావిస్ హెడ్ మొదటి రెండు మ్యాచుల్లో బెంచ్‌కే పరిమితం అయ్యాడు. అయితే.. ఇవాళ జరగనున్న మ్యాచ్ కీలకం కానున్న నేపథ్యంలో.. అతడు బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. వరల్డ్ కప్‌లో డబుల్‌సెంచరీతో చెలరేగిన మ్యాక్స్‌వెల్ కూడా రెండు మ్యాచుల్లో విఫలం అయ్యాడు. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆసీస్ ఎలాంటి మార్పులతో దిగుతుందనేది చూడాలి.