గిల్ నెక్ట్స్ విరాట్ కోహ్లీ అవ్వాలనుకుంటున్నాడు: సురేశ్ రైనా
రాబోయే వన్డే ప్రపంచ కప్‌లో అత్యంత ముఖ్యమైన ఆటగాళ్లలో గిల్ కూడా ఉంటాడని రైనా అభిప్రాయపడ్డాడు.
By Srikanth Gundamalla Published on 21 Sept 2023 5:21 PM ISTగిల్ నెక్ట్స్ విరాట్ కోహ్లీ అవ్వాలనుకుంటున్నాడు: సురేశ్ రైనా
భారత క్రికెట్ జట్టులో ప్రస్తుతం అద్భుత ఆటగాళ్లు ఉన్నారు. ఇటు బ్యాటింగ్.. అటు బౌలింగ్‌లోనూ మంచి ప్రదర్శనను ఇస్తున్నారు. వన్డే వరల్డ్ కప్‌కు ముందు మంచి ఫామ్‌లో ఉన్నట్లు కనిపిస్తున్నారు. అయితే.. సీనియర్ ఆటగాళ్లు కాకుండా యంగ్‌స్టర్స్‌ను చూసుకున్నట్లయితే.. శుభ్‌మన్ గిల్ ముందు వరుసలో ఉన్నాడనే చెప్పాలి. ఈ 24 ఏళ్ల కుర్రాడు కొంతకాలంగా నిలకడగా ఆడుతున్నాడు. అంతేకాదు.. ఇటీవల జరిగిన ఐపీఎల్‌లో టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. ఇక ఆసియా కప్ టోర్నీలో అయితే 75.50 సగటుతో 302 పరుగులు చేశాడు గిల్.
మరో మూడేళ్ల తర్వాత సీనియర్లు రోహిత్, విరాట్ కోహ్లీ రిటైర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో.. శుభ్‌మన్ గిల్ టీమిండియా భవిష్యత్ స్టార్‌గా ఎదుగుతున్నాడు గిల్. ఈ క్రమంలో శుభ్‌మన్ గిల్ గురించి టీమిండియా మాజీ ప్లేయర్ సురేశ్ రైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. శుభ్‌మన్ గిల్ తదుపరి విరాట్ కోహ్లీ అవ్వాలనుకుంటున్నాడని చెప్పాడు. రాబోయే వన్డే ప్రపంచ కప్‌లో అత్యంత ముఖ్యమైన ఆటగాళ్లలో గిల్ కూడా ఉంటాడని రైనా అభిప్రాయపడ్డాడు.
శుభ్‌మన్ గిల్ ఏడాదిన్నరగా నిలకడగా ఆడుతున్నాడని సురేశ్ రైనా అన్నాడు. కాకపోతే మధ్యలో జరిగిన వెస్టిండీస్ టూర్‌లో మాత్రమే కాస్త తడబడ్డాడని చెప్పాడు. కానీ.. ఆసియా కప్‌లో మాత్రం అతడి కమ్‌బ్యాక్ అద్భుతంగా ఉందని చెప్పాడు. మంచి స్కోర్లు చేశాడని సురేశ్ రైనా ప్రశంసించాడు. గిల్ ఫుట్ వర్క్ కూడా బాగుందని.. సునాయసంగా హాఫ్ సెంచరీ.. సెంచరీలు చేస్తున్నాడని అన్నాడు. రానున్న వన్డే వరల్డ్ కప్‌లో శుభ్‌మన్ గిల్ కచ్చితంగా ముఖ్యమైన ఆటగాళ్లలో ఉంటాడని అభిప్రాయపడ్డాడు. అయితే.. గిల్ స్టార్ ఆటగాడిగా ఎదగాలని.. తదుపరి విరాట్ కోహ్లీ అవ్వాలనుకుంటున్నాడని రైనా చెప్పాడు. అయితే.. ఇప్పటికే అతడు ఆ దిశగా అడుగులు కూడా వేస్తున్నాడని చెప్పాడు. ఈ వన్డే వరల్డ్ కప్ తర్వాత తరచూ తన గురించే మాట్లాడుకుంటామని రైనా అన్నాడు. శుభ్‌మన్ గిల్‌కు ఎక్కడ బౌలింగ్ వేయాలో స్పిన్నర్లకు కకూడా తెలియదని.. ఫాస్ట్ బౌలర్లు బంతిని స్వింగ్ చేయకపోతే నేరుగా లేదా ఫ్లిక్‌తో గిల్ బాగా ఆడగలడని సురేశ్ రైనా అన్నాడు. 2019లో రోహిత్ శర్మ రాణించిన విధంగానే.. గిల్ కూడా వన్డే వరల్డ్ కప్‌లో గిల్ రాణిస్తాడని అన్నాడు. పైగా ఓపెనర్ కావడంతో 50 ఓవర్లకూ ఆడే అవకాశం లభిస్తుందని.. మంచి స్కోర్లు చేసేందుకు అవకాశాలు ఉన్నాయని సురేశ్ రైనా చెప్పాడు.
కాగా.. భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాతో సెప్టెంబర్ 22 నుంచి ప్రారంభం కానున్న మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత అక్టోబర్ 5 నుంచి వన్డే వరల్డ్ కప్ ప్రారంభం అవుతుంది.