అవును టీమిండియాతో మ్యాచ్ ఉంది..ఐతే ఏంటి?: పాక్ కెప్టెన్ బాబర్
భారత్‌తో జరిగే మ్యాచ్ కోసం మాత్రమే మేం ఆతృతగా ఎదురు చూడటం లేదు అని పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ అన్నాడు.
By Srikanth Gundamalla Published on 7 July 2023 5:37 PM IST
అవును టీమిండియాతో మ్యాచ్ ఉంది..ఐతే ఏంటి?: పాక్ కెప్టెన్ బాబర్
భారత్‌లో వన్డే వరల్డ్ కప్ జరగనుంది. ఈ క్రమంలో వరల్డ్ కప్‌లో ఆడేందుకు పాకిస్థాన్ జట్టు రానుంది. ఈ క్రమంలో భారత్-పాకిస్థాన్ మధ్య జరిగే మ్యాచ్‌పై అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. చాలా కాలం తర్వాతా దాయాది దేశంతో టీమిండియా ఆడబోతుంది. ఇప్పటి వరకు పాకిస్థాన్‌పై భారత్‌కు మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజాంను అక్కడి మీడియా వరల్డ్ కప్ గురించి కొన్ని ప్రశ్నలు అడిగింది.
మీడియాతో మాట్లాడిన బాబర్ అజామ్.. 'భారత్‌తో జరిగే మ్యాచ్ కోసం మాత్రమే మేం ఆతృతగా ఎదురు చూడటం లేదు. పాకిస్థాన్ టీమ్ ఆడబోయే తొమ్మిది మ్యాచ్‌లపైనా మా ఫోకస్ ఉంది. అన్నింటిలోనూ గెలవాలనే ఆలోచనతో ఉంటాం. అన్ని టీమ్‌లతో ఆడుతున్నట్లుగా భారత్‌తో తమ మ్యాచ్ ఉంటుంది. అన్ని మ్యాచ్‌లకు ఉన్న ప్రాధాన్యతే భారత్‌తో జరిగే మ్యాచ్‌కు ఉంటుంది. ప్రపంచ కప్ ఆడేందుకు భారత్ వెళ్తున్నాం. అంతేకానీ.. కేవలం టీమిండియాతో మాత్రమే క్రికెట్ ఆడటానికి కాదు. ఇక టీమిండియా కూడా మిగతా 8 మ్యాచ్‌లు ఆడి వారిపైనా గెలవాల్సి ఉంటుంది' అని పాకిస్థాన్ క్రికెట్ కెప్టెన్ బాబర్ అన్నాడు. అత్యధిక విజయాలు సాధిస్తేనే ఎవరైనా ఫైనల్‌కు చేరుకుంటారు.. తద్వారా కప్‌ను గెలిచే అవకాశాలు ఉంటాయని అన్నాడు.
ఈసారి అన్ని తమ జట్టు బలంగా ఉంటుందని చెప్పాడు బాబర్ అజామ్. ఏ దేశంలో ఆడినా పాకిస్థాన్‌ను గెలిపించడమే తన లక్ష్యమని చెప్పాడు. కాగా.. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు వరల్డ్ కప్-2023 జరగనుంది. మొత్తం పది జట్లు ఈ టోర్నీలో పాల్గొననున్నాయి. భారతీయులతో పాటు అందరూ ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఎదురు చూస్తోన్న భారత్-పాక్ మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 15న జరగనుంది.