IND Vs ENG: సచిన్ రికార్డును బ్రేక్ చేసిన జో రూట్

ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో తొలి టెస్టు ఆడుతున్నాయి ఇంగ్లండ్, భారత్‌ జట్లు.

By Srikanth Gundamalla  Published on  25 Jan 2024 10:01 AM GMT
IND Vs ENG, test match, joe root, sachin,  record,

IND Vs ENG: సచిన్ రికార్డును బ్రేక్ చేసిన జో రూట్

ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో తొలి టెస్టు ఆడుతున్నాయి ఇంగ్లండ్, భారత్‌ జట్లు. అయితే.. తొలి టెస్టులో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్‌ ఎంచుకుంది. భారత స్పిన్నర్లు రాణించారు. దాంతో.. తొలి ఇన్నింగ్స్‌లో 246 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్ అయ్యింది. ఏకంగా 8 వికెట్లు స్పిన్నర్లే తీశారు. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్‌ స్టోక్స్‌ 88 బంతుల్లో 70 పరుగులు చేశారు. ఇందులో ఆరు ఫోర్లు.. మూడు సిక్స్‌లు ఉన్నాయి. ఇతను తప్ప మరెవరూ హాఫ్‌ సెంచరీ చేయలేకపోయారు. బెయిర్‌స్టో 37, పరుగులు, జో రూట్ 29 పరగులు చేశారు. ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన టామ్‌ హార్ట్‌లీ 24 బంతుల్లో 23 పరుగులు చేశాడు.

తొలి సెషన్‌లో 108 పరుగులు చేసిన ఇంగ్లండ్ మూడు వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత రెండో సెషన్‌లో ఇంకాస్త ఎక్కువే తడబడింది. అంచ్‌ బ్రేక్‌ వరకే 5 వికెట్లు కోల్పోయి 107 పరుగులు సాధించింది.దాంతో.. 215 పరుగుల వద్ద 8 వికెట్లు కోల్పోయింది. చివరి సెషన్‌ను ఆరంభించిన ఇంగ్లండ్ మరో 31 పరుగులు మాత్రమే జోడించి రెండువికెట్లను కోల్పోయింది. భారత బౌలర్లలో అశ్విన్, జడేజా చెరో మూడు వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్ 2, బుమ్రా 2 వికెట్లు తీశారు.

అయితే.. ఈ మ్యాచ్‌లో స్టార్ క్రికెటర్ జో రూట్ అరుదైన రికార్డును సాధించాడు. ఇండియా వర్సెస్‌ ఇంగ్లండ్ టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రూట్‌ నిలిచాడు. ఉప్పల్‌లో జరిగిన తొలి టెస్టులో 10 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద ఈ ఘనతను అందుకున్నారు. కాగా.. జో రూట్‌ ఇప్పటి వరకు ఇండియాతో ఆడిన 45 ఇన్నింగ్సుల్లో 2555 పరుగులు చేశాడు. క్రికెట్‌ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ రికార్డును బ్రేక్‌ చేశాడు. సచిన్ టెండూల్కర్ భారత్-ఇంగ్లండ్ టెస్టుల్లో 53 ఇన్నింగ్స్‌లు ఆడి 2535 పరుగులు చేశాడు. ఇక తొలి టెస్టులో సచిన్ ఆల్‌టైమ్‌ రికార్డు బ్రేక్‌ అయ్యింది. ఇక ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో విరాట్‌ కోహ్లీ 1991 పరుగులతో ఐదో స్థానంలో ఉన్నాడు.

Next Story