ఐసీసీ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్.. కెప్టెన్ సహా ఆరుగురు మనోళ్లే..
టీమిండియాలో ప్రస్తుతం ఎంతో మంచి ఆటగాళ్లు ఉన్నారు.
By Srikanth Gundamalla Published on 23 Jan 2024 2:45 PM IST
ఐసీసీ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్.. కెప్టెన్ సహా ఆరుగురు మనోళ్లే..
టీమిండియాలో ప్రస్తుతం ఎంతో మంచి ఆటగాళ్లు ఉన్నారు. ఇప్పుడున్న ఆటగాళ్లతో ఒక్క టీమ్ సెట్ చేయాలంటే బీసీసీఐ అధికారులకు ఇబ్బందిగానే మారింది. ఎవరిని పక్కనపెట్టాలో అర్థం కాని పరిస్థితి ఉంది. దాంతో.. టీమిండియా ఎంతో పటిష్టంగా కనబడుతోంది. అయితే.. గత 2023 వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా అద్భుతంగా రాణించింది. ఫైనల్ వరకు ఒక్క ఓటమి కూడా చూడకుండా చేరుకుంది. కానీ.. ఫైనల్‌లో నిరాశ తప్పలేదు.
కాగా.. ఐసీసీ తాజాగా 'వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్'ను ప్రకటించింది. అంటే..అన్ని దేశాలను కలుపుకొని ఉత్తమ ఆటగాళ్లను ఎంపిక చేసి బెస్ట్ టీమ్‌ను ఎంపిక చేసింది ఐసీసీ. ఇందులో ఏకంగా భారత్ నుంచి ఆరుగురు క్రికెటర్లు చోటు దక్కించుకున్నారు. ఈ ఎలైట్ టీమ్‌కు కెప్టెన్‌గా రోహిత్ శర్మను ప్రకటించారు. 2023 ఏడాదికి గాను అద్భుతంగా రాణించిన 11 మంది క్రికెటర్లతో కూడిన జట్టును ఐసీసీ ప్రకటించింది. ఇక సోమవారం ఐసీసీ బెస్ట్ టీ20 టీమ్ లో నలుగురు టీమిండియా ఆటగాళ్లు నిలిచిన విషయం తెలిసిందే.తాజాగా వన్డే క్రికెట్ బెస్ట్ టీమ్‌లో ఆరుగురికి చోటు దక్కడంతో అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్‌కు తిరుగులేదని మరోసారి నిరూపితమైంది.
2023 ఏడాదిలో వన్డేల్లో రోహిత్ శర్మ 52 సగటుతో 1255 పరుగులు సాధించాడు. ఐసీసీ వరల్డ్ కప్ 2023లో అప్ఘానిస్థాన్‌పై ఏకంగా 131 పరుగులు చేశాడు. అంతేకాదు.. వరల్డ్ కప్‌లో భారత జట్టును అజేయంగా ముందుకు తీసుకెళ్లాడు. ఇటు బ్యాటింగ్‌లో రాణిస్తూనే.. కెప్టెన్సీలో కూడా మంచి ఫలితాలు ఇవ్వడంతో రోహిత్‌కు వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ కెప్టెన్సీ దక్కింది. ఐసీసీ జట్టులో సగానికి పైగా మనోళ్లే నిలిచారు. గిల్, విరాట్ కోహ్లీతో పాటు ముగ్గురు బౌలర్లు చోటు దక్కించుకున్నారు.
ఐసీసీ 'వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్' ఇదే:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ట్రావిస్ హెడ్, విరాట్ కోహ్లీ, డారిల్ మిచెల్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), మార్కో జాన్‌సేన్, ఆడమ్ జంపా, మొహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ షమీ.